రాజస్తాన్ నుంచి పాకిస్తాన్ లోని తన 'స్నేహితుడు' నస్రుల్లాను కలుసుకునేందుకు వెళ్లిన అంజు.. తాను సీమా హైదర్ లాంటిదానిని కానని చెబుతోంది. రెండు లేదా నాలుగు రోజుల్లో తిరిగి ఇండియాకు వచ్చేస్తానని, తనకు నస్రుల్లా వట్టి ఫ్రెండ్ మాత్రమేనని తెలిపింది. చట్టబద్ధంగానే నేను పాకిస్థాన్ వచ్చాను. నాకు అధికారులు ఎవరూ అడ్డు చెప్పలేదని వెల్లడించింది. సైట్ సీయింగ్ కోసం ఈ దేశానికి వచ్చాను.. ఫేస్ బుక్ ద్వారా నాకు పరిచయమైన నస్రుల్లాను పెళ్లాడే ఉద్దేశం నాకు లేదు.. అతని కుటుంబం నన్ను ఎంతో ఆదరించింది అని ఆమె పేర్కొంది.
ఇండియాలో మనాలీ వంటి ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉన్నానని. ఇక్కడి ప్రకృతి వాతావరణం ఎంతో బాగుందని అంజు వెల్లడించింది. ఇక్కడో వివాహం ఉంది. దానికి అటెండ్ కావడానికి వచ్చాను.. రాజస్తాన్ లోని భివాడీ జిల్లా నుంచి మొదట ఢిల్లీకి వచ్చా.. , అక్కడినుంచి అమృత్ సర్ వెళ్లి వాఘా బోర్డర్ ద్వారా పాకిస్తాన్ చేరుకున్నా అని ఆమె వివరించింది.
రెండేళ్ల క్రితమే నస్రుల్లాతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, మా ఇద్దరి కుటుంబాలూ ఎంతో సన్నిహితంగా ఉన్నాయని అంజు స్పష్టం చేసింది. తన భర్త అరవింద్ తో తనకు సఖ్యత లేదని, కొన్ని పరిస్థితుల కారణంగా అతనితో ఉంటున్నానని చెప్పిన అంజు.. ఇండియాకు వచ్చాక తన ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటానని ప్రకటించింది.
గురుగ్రామ్ లో తనకు ఉద్యోగం ఉందనికూడా పేర్కొంది. నస్రుల్లాను వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదని మళ్ళీ తెలిపింది. ఇండియాలో ఓ వర్గం మీడియా తమ మీద ఊహాగానాలతో ఏవేవో కథలు రాశాయని అంజు మండిపడింది.