Air Pollution: దేశరాజధాని ఢిల్లీ (Delhi) కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చేసరికి ఢిల్లీ ప్రజలు వాతావరణ కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుండడం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ వాతావరణ కాలుష్యం (Air Pollution) సాధారణ స్థాయిలను దాటి చాలా ఎక్కువగా నమోదు అవుతోంది. దీంతో డీజిల్ వాహనాలను నిషేధించారు. అలాగే స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నవంబర్ 3 సాయంత్రం, ఢిల్లీ లోని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 865 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది హెచ్చరిక లాంటిది. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వాతావరణ కాలుష్యం ఎలా లెక్కిస్తారు? కాలుష్యం ఎక్కువగా ఉందని ఎప్పుడు చెబుతారు? ఇలాంటి విషయాలను అర్ధం చేసుకుందాం.
Also Read: ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్య దెబ్బ.. స్కూల్స్ కు రెండురోజుల సెలవు
వాతావరణ కాలుష్య తీవ్రత అంచనా కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను (Air Quality Index) ఉపయోగిస్తుంది. మనుషులు జీవించడం కోసం ఈ వాతావరణం అనుకూలమా? కాదా? అనే విషయాన్ని నిర్ణయించడానికి ప్రపంచం మొత్తం ఉపయోగించే ప్రమాణం ఇది. ప్రతి సంవత్సరం ఢిల్లీ లో వాతావరణ కాలుష్య ప్రభావం ఉంటూనే ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వాతావరణ కాలుష్య ప్రభావం ప్రారంభం అయింది. ఇప్పుడు తీవ్ర స్థాయిలో మారిపోయింది. ఎంతలా అంటే గంట గంటకూ కాలుష్య తీవ్రతలు మారిపోతున్నాయి.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాలు ఇవే..
AQI కనుక 50 వరకు ఉంటె అది మంచిది. అలాగే 51-100: సంతృప్తికరంగా ఉంది అని చెబుతారు. 101-200: మితమైన కాలుష్యం ఉన్నట్టు లెక్క. ఇక ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక 201-300 ఉంటె అది చెడ్డదిగా అంటే ఆరోగ్యంపై ప్రభావం చూపించేదిగా చెబుతారు. అలాగే ఈ AQI 301-400 చాలా చెడు చేస్తుందని అంటారు. అంటే ప్రజలు తీవ్ర శ్వాసకోశ సంబంధిత బాధలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇండెక్స్ కనుక 401-500 అయితే.. అది తీవ్రమైన వాతావరణ కాలుష్యాన్ని సూచిస్తుంది. ఇది పూర్తిగా అందర్నీ అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.
గాలి ఎప్పుడు విషపూరితం అవుతుంది? చూద్దాం..
గాలిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, అమ్మోనియా, నేల స్థాయి ఓజోన్, సీసం, ఆర్సెనిక్ నికెల్, బెంజీన్, బెంజీన్ పైరీన్, PM-10- PM-2.5 అకస్మాత్తుగా పెరుగుతుంది. అప్పుడు గాలి చెడ్డదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇందులో పీఎం 2.5 పాత్ర చాలా ప్రమాదకరం. ఇది దృశ్యమానతను తగ్గిస్తుంది. అంటే ఎదురుగా ఉన్న మనుషులు కూడా కనిపించకుండా చేస్తుంది. దీని కణాలు చాలా చిన్నవి. ఒక కణం మీటరులో ఒక మిలియన్ వంతు ఉంటాయి. ఈ కణాలు సులభంగా మన శరీరంలోకి చేరి రక్తంలో కలిసిపోతాయి. దీని తక్షణ ప్రభావం ఆస్తమా - శ్వాసకోశ రోగుల సమస్యలను పెంచుతుంది. గాలి నాణ్యత సూచిక మితంగా ఉన్నప్పుడే అంటే 101-200 మధ్య ఉన్నపుడే అది ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది.
వాతావరణ కాలుష్యం కారణంగా..
వాతావరణ కాలుష్యం కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారతదేశంలో ఈ సంఖ్య 16 లక్షలకు పైగా ఉంది. చెడు గాలి నేరుగా వయస్సును ప్రభావితం చేస్తుందని మరొక అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 2.2 సంవత్సరాలు. ఢిల్లీ-యుపిలో ఆయుర్దాయం 9.5 సంవత్సరాలకు పైగా తగ్గుతోంది. భారతదేశంలో, 2019 లో, 1.16 లక్షల మంది నవజాత శిశువులు గాలి నాణ్యత కారణంగా మాత్రమే మరణించారు.
ఒక్కసారిగా కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?
నిజానికి చలి కాలం రాగానే వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా పీఎం-2.5 పరిమాణం 25 శాతం పెరుగుతుంది. ఇది వేసవిలో 8-9 శాతంగా ఉంటుంది. రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము కూడా పెరుగుతుంది. ఐఐటీ కాన్పూర్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో ప్రతిరోజూ ఐదు వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దానిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇక్కడ తరచుగా మంటలు సంభవిస్తాయి. దీనివలన వచ్చే విషపూరిత పొగ కాలుష్యాన్ని మరింత పెంచుతుంది. ఈసారి అక్టోబరులో వర్షాలు కురవడంతో వాతావరణం కూడా అధ్వానంగా మారింది.
Please watch this video on Air Pollution in Delhi: