తెలంగాణకు మరోసారి వాన గండం పొంచిఉంది. రాష్ట్రంలో బుధవారం, గురువారం రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళు చెట్ల క్రింద ఉండొద్దని సూచించింది.
మరోవైపు హైదరాబాద్‌లో సైతం వర్షం పడే అవకాశం ఉందన్న భారత వాతావరణ విభాంగా.. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపింది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద ముంచెత్తింది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో అనేక మంది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి ఇళ్లకు వరద నీరు చేరింది. దీంతో కొందరు ఇంటి పైకప్పు ఎక్కగా.. మరికొందరు చెట్లెక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతికారు.
వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు సైతం కుప్పకూలాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. అత్యవసర సమయాల్లో తిరిగే అంబులెన్స్‌లు సైతం రాకపోవడంతో రోగులు, గర్బిణిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల వల్ల అధ్వానంగా మారిన రహదారుల గుండా వెళ్లాలంటే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారుల గుండా వెళ్లి ఎక్కడ పడిపోతామో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతుల పంట పొలాల గుండా వరద నీరు ప్రవహించడంతో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల వల్ల తాము సర్వం కోల్పోయినట్లు వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపినా ప్రభుత్వం లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేయలేదని, ప్రభుత్వ అధికారులు తమను అప్రమత్తం చేసుంటేఇంత నష్టం జరగకపోయి ఉండేదన్నారు. వరదల్లో చిక్కుకున్న తమను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం కూడా చేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలపగా.. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.