AIIMS : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శుభవార్త చెప్పింది. ఈ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్ వంటివాటితోపాటు గ్రేడ్ 2 తదితర ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది.
ఈ ప్రకటన ద్వారా ఎయిమ్స్ భటిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్‌పూర్, దేవ్‌ఘర్, గోరఖ్‌పుర్, జోధ్‌పుర్, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పుర్, రాయ్‌బరేలీ, న్యూఢిల్లీ, పట్నా, రాయ్‌పుర్, రాజ్‌కోట్, రిషికేశ్, విజయ్‌పుర్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.3000. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. అభ్యర్థులకు అనువుగా ఉండే నిమిత్తం ఐదారు పోస్టులను ఒక గ్రూపుగా విభజించారు. వీటన్నింటికీ ఒక దరఖాస్తును పంపితే సరిపోతుంది. అభ్యర్థులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ దరఖాస్తును నింపాలి. ఉద్యోగాన్ని బట్టి గరిష్ఠ వయసులో మార్పులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ గ్రూప్-బి పోస్టులకు ఐదేళ్లు, గ్రూప్-సి పోస్టులకు మూడేళ్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
Also read : తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటింగ్.. ఓటు ఎలా వేస్తున్నారో వీడియో చూడండి!
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్-555, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-144, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్- 142, హాస్పిటల్ అటెండెంట్-417.. ఇంకా అసిస్టెంట్ డైటీషియన్, ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్యాషియర్, మెడికల్ రికార్డ్ టెక్నీషిన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డెంటల్ హైజీనిస్ట్/ టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, గ్యాస్ పంప్ మెకానిక్, హాస్పిటల్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ (గ్రేడ్-2), ల్యాబ్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, లైబ్రెరియన్, జూనియర్ ఇంజినీర్ (ఏసీ అండ్ ఆర్), జూనియర్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్. జూనియర్ ఫిజియోథెరపిస్ట్, స్టోర్ కీపర్, జూనియర్ వార్డెన్ (హౌస్‌కీపర్), మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ (గ్రేడ్-2), మెడికల్ సోషల్ వర్కర్, మార్చురీ అటెండెంట్, మల్టీ రిహేబిలిటేషన్ వర్కర్, ఆప్టోమెట్రిస్ట్, పెర్‌ఫ్యూజనిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, పార్మసిస్ట్, ఫార్మసిస్ట్ (గ్రేడ్-2)-.. మొదలైన 100 రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ నియామక పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-1లో జనరల్, పార్ట్-2లో డొమైన్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. జనరల్ లో 40 మల్టీఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-10 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్- 10 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-10 ప్రశ్నలు, ఇంగ్లీష్/హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వ్యవధి 45 నిమిషాలు. అలాగే డొమైన్ కు పరీక్షలో 40 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్హతలు, ఉద్యోగ అనుభవానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 45 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. అన్‌రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 40 శాతం. ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం. బ్యాంక్, ఆర్‌ఆర్‌బీ, ఇతర పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా జనరల్ భాగంలోని అంశాలను మెరుగుపరుచుకోవచ్చు.
ఈ ఉద్యోగాల ఆన్‌లైన్ అప్లికేషన్ కు చివరి తేదీ డిసెంబర్ 01. కాగా సవరణల కోసం డిసెంబర్ 06-07 రెండు రోజులు అవకాశం కల్పించింది. హాట్ టికెట్లను డిసెంబర్ 12నుంచి అందుబాటులో ఉంచనున్నారు. డిసెంబర్ 18-20 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్: http://www.aiimsexams.ac.in/ సంప్రదించవచ్చు.