Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కొత్త పీసీసీ చీఫ్ పై చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావించింది.
అయితే.. ఈలోగా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో రేవంత్ ను కొనసాగించింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ చీఫ్ కోసం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో.. బీసీలకు ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ మధ్య తీవ్రంగా పోటీ పడ్డారు.
అయితే.. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ కు సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో పోటీ నుంచి తప్పుకుని వేరే వారికి అవకాశం ఇవ్వడం, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడం, వివాదరహితుడిగా పేరుండడం ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.