Actor Ali to Contest From AP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీనీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) స్పందించారు. సోమవారం ఓ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన..ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయంపై ఇంకా క్లారిటీ లేదన్నారు.
జగన్ పిలుపు కోసం వెయిటింగ్..
ఈ మేరకు అలీ మాట్లాడుతూ.. ‘ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాకు కూడా క్లారిటీ లేదు. ఇంకా సీఎంవో నుంచి కాల్ రావాల్సిఉంది. సీఎం పిలిచి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలో పిలుపు వస్తుందని అనిపిస్తోంది. ఏ పార్టీలో ఉన్నాసరే పోటీలో నిలబడిన వ్యక్తి మంచివాడైతే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. అక్కడినుంచి ఇక్కడికి.. ఇక్కడినుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా.. అంతిమ నిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ రెడీ అంటున్నాం. వాళ్లంతా కూడా సిద్దమే అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
ఇబ్బందిపడతాననే దృష్టితో..
ఇక హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన అలీ కొన్నేళ్ల క్రితం వైసీపీలో (YCP) చేరారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయమని తనని అడిగారని, అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా రాజకీయాల్లో అడుగుపెడితే ఇబ్బందిపడతాననే దృష్టితో పోటీ చేయలేదని చెప్పారు. అంతేకాదు అప్పటికే ఒప్పుకొన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు.