Mumbai: క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్న ఓ యువకుడు ఉన్నట్టుండి మైదానంలోనే కుప్పకూలిపోయాడు. బౌలర్ నెమ్మదిగా వేసిన బంతిని బలంగా సిక్సర్ బాదిన అతడు సెకన్ల వ్యవధిలోనే వికెట్ల్ దగ్గర కిందపడిపోయాడు. విషయం గమనించిన తోటి ఆటగాళ్లు, సిబ్బంది వెంటనే అతన్ని అస్పత్రికి తరలించగా అప్పటికే గుండుపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ బాధకరమైన సంఘటన ముంబైలోని మీరా రోడ్‌లో జరగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: AP News: ఏపీలో వాట్సాప్ స్టేటస్, షేరింగ్స్ నిషిద్ధం.. డీజీపీ హరీష్ గుప్తా సంచలన ప్రకటన!
ఈ మేరకు ముంబైకి చెందిన ఓ కంపెనీ మీరా రోడ్‌లో టర్ఫ్ క్రికెట్ టోర్నీ నిర్వహించింది. ఇందులో చాలా జట్లు పాల్గొనగా.. మ్యాచ్ తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే ఆదివారం పింక్ అండ్ ఎల్లో జెర్సీల (జట్ల పేర్లపై స్పష్టత లేదు) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో పింక్ కలర్ జెర్సీ ధరించిన యువకుడు బంతిని సిక్సర్ బాదడంతో ప్రేక్షకులంతా సంబరాల్లో మునిగితేలారు. అతన్ని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారు. అదే ఊపులో మరో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన బ్యాటర్.. కను రెప్పపాటులో వికేట్ల దగ్గర నేలపై పడిపోయాడు. ఆ క్షణం ఏం జరిగిందో అర్థం కాక అందరూ అయోమయంలో పడిపోయారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ యువ క్రికెటర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. యువకుడి మృతిపై కాశీగావ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.