Minister Malla Reddy Election Affidavit: మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఆయన నామినేషన్ రద్దయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) మల్లారెడ్డి అఫిడవిట్‌పై తీవ్ర వివాదం నెలకొంది. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. ఇదే అంశంపై మేడ్చల్ రిటర్నింగ్ అధికారికి అంజిరెడ్డి అనే ఓటర్ ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి తన ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్‌ను తప్పుగా చూపించినట్లు కంప్లైంట్ ఇచ్చారు సదరు వ్యక్తి. 3 ఎన్నికల్లో 3 రకాలుగా ఎడ్యూకేషన్ డీటైల్స్ పేర్కొన్నారు మల్లారెడ్డి. 1973లో ఇంటర్ చేసినట్లు చూపారు మల్లారెడ్డి. అయితే, గత మూడు ఎన్నికల అఫిడవిట్లలో మూడు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది.
మల్లారెడ్డి గత, ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఇంటర్మీడియట్ చదివినట్లుగా పేర్కొన్న కాలేజీల వివరాలివి. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో తాను ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లుగా పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో తాను వెస్లీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.
ఇదొక్కటే కాదండోయ్.. మరో తప్పుడు సమాచారం కూడా ఉంది మల్లారెడ్డి అఫిడవిట్‌లో. 2014 ఎన్నికల్లో మల్లారెడ్డి తన వయసు 56గా పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తన వయసు 70గా చూపించారు. అంటే.. 9 ఏళ్లలోనే మల్లారెడ్డి వయసు 14 ఏళ్లు పెరిగిందన్నమాట. ఇప్పుడిదే పెద్ద రచ్చగా మారింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో అన్నీ తప్పులే ఉన్నాయని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రత్యర్థులు. మరి అధికారులు ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Also Read:
తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..!