ఆగ్రాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అతుస్ గ్రామంలో ఓ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న ఆ యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు.ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
వీడియో ఆధారంగా పోలీసులు ప్రధాన నిందితుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో, రక్తం కారుతున్న యువకుడు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కనే కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు. ఒక యువకుడి ముఖం కనిపిస్తుంది. మరొకరి గొంతు వినబడుతుంది. దుర్భాషలాడుతూ ఆ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు.
బాధిత యువకుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సమీపంలో నిలబడి ఉన్న యువకులు అతన్ని గట్టిపట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సికంద్రా ప్రాంతంలోని అటస్ గ్రామానికి సమీపంలో ఉందని డిసిపి సిటీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. దాడికి గురైన వ్యక్తి విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. వీడియోలో ఉన్న యువకుడిని ఆదిత్య ఇండోలియాగా గుర్తించారు.ఆదిత్య ఇండోలియా, అతని సహచరుడు భోలాను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను విచారించి మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువకుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన ముఠాపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. వీటిలో దోపిడీ, దొంగతనాల కేసులు ఉన్నట్లు చెప్పారు.