Nellore: జాతీయ రహాదారిపై వేగంగా వెళ్తున్న కారును పెద్ద పులి ఢీ కొట్టిన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కారుపై పులి దాడికి పాల్పడగా కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ మేరకు స్థానికుల వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును వెంబడించిన పులి కారుపైకి దూకి దాడికి పాల్పడి క్షణాల్లో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్న వారు గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పులిజాడలను గుర్తించి వాహనదారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అదే రోడ్డుపై ఇతర వాహనాల్లో వెళుతున్న ప్రత్యక్ష సాక్షులు.. తమ కళ్ళ ఎదుటే పులి కారుపై దాడి చేసి క్షణాల్లో వెళ్ళిపోయిందని, తాము కూడా భయభ్రాంతులకు గురయ్యామని వాపోయారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పోలీసులు పులి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొని రెండు చిరుతపులులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.