కోటిఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ ఒక్కగానొక్క కూతురు...పదేళ్ల వయస్సులోనే ప్రాణాంతక వ్యాధి బారినపడుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. తమ కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆ ఫలితాలు ఫలించలేదు. అప్పటికే మ్రుత్యువు దగ్గరికి వచ్చింది. రోజలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కొన్ని రోజులు మాత్రమే అని వైద్యులు తెలిపారు. తమ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కూతురు తమ ముందే మరణానికి చేరవవుతోన్నా...పుట్టెడు బాధను దిగమింగుకుని గుండెను రాయి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ కూతురు కోరికను తీర్చి ఆమె చివరి క్షణాల్లో ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూశారు. స్నేహితుడితో ఆమెకు వివాహం చేసి తన చివరి కోరికను నెరవేర్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా...దీని వెనక గుండెలను మలిపెట్టే విషాదం ఉంది. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే...నార్త్ కరోలినాలోని అలీనా, ఆరోన్ ఎడ్వర్డ్స్ అనే దంపతులకు ఎమ్మా ఎడ్వర్డ్స్ అనే పదేళ్ల కూతురు ఉంది. ఈ ఏడాది జూన్ లో ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు వారి తల్లిదండ్రులు. పాపకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులకు భూమి ఆగినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఏమైతుందో వారికి అర్థం కాలేదు. షాక్ లో నుంచి బయటకు వచ్చిన వారు తమ కూతురును ఎలాగైనా కాపాడుకోవాలని..ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
వ్యాధి బాగా ముదిరిపోయింది. ఇంకా రోజులే లెక్కపెట్టాల్సిందని వైద్యులు తెలిపారు. దీంతో తమ కూతురు చివరి కోరికను తీర్చి సంతోషంగా ఉంచాలని ఆ తల్లిదండ్రులు భావించారు. ఆ చిన్నారి తనకు పెళ్లి కావాలని అడుగుతుండేదట. ఆ క్రమంలో ఆ చిన్నారి కోరికను తీర్చేందుకు...ఆమె మాటను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడితో వివాహం జరిపించేందుకు ...స్నేహితుడి తల్లిదండ్రులు అసలు విషయం చెప్పారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ సమయంలో ఇరుగుపొరుగువారుకూడా ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
జూన్ 29న బంధుమిత్రుల సమక్షంలో ఎమ్మాఎడ్వర్డ్ కు తన స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ పెళ్లి రెండు రోజులపాటు ఘనంగా జరిపించారు. ఈ పెళ్లి జరిగిన 12రోజులకు ఎమ్మా పరిస్థితి విషమించింది. జూలై 11న ఆ చిన్నారి మరణించింది. కానీ పదేళ్ల వయస్స్సులో చిన్నారులకు బొమ్మలు కావాలని...ఎక్కడైన పార్కుకు వెళ్లాలనే కోరిక ఉంటుంది.. కానీ ఈ చిన్నారి మాత్రం పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ఆమె కొరికను తీర్చేందుకు పెళ్లి జరిపించామని కళ్లలో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.