హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి క్రైమ్ టీమ్ చేరుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రలు.. ఐదుగురు మేదాంతలో, ఆరుగురు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనతో ఢిల్లీ జైపూర్ హైవేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు ఆంధ్ర ప్రదేశ్ కు చెందినది. జైపూర్ వైపు వెళుతోంది. పోలీస్ కమిషనర్ వికాస్ అరోరా, డీసీ నిశాంత్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో వృద్ధురాలు, యువతి ఉన్నట్లు సమాచారం. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-12 నుంచి మీర్‌పూర్‌కు బస్సు వెళ్తోందని పోలీసు కమిషనర్ వికాస్ అరోరా తెలిపారు. అందులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ ఘటన జరిగిన తర్వాత సివిల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ బృందం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ హెడ్ డాక్టర్ మానవ్ ఆధ్వర్యంలో సర్జన్ డాక్టర్ అమన్‌దీప్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరవింద్ జిందాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి మేనేజర్ డాక్టర్ మనీష్ రాఠీ తెలిపారు.