Telangana: గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు..

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఓ డీసీఎం డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అందులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌ను జేసీబీ సాయంతో బయటికి తీశారు.

New Update
Telangana: గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు..

ఏదైన తెలియని రూట్‌కు వెళ్లాలంటే ఈ మధ్య కాలంలో అందరూ గూగుల్ మ్యాప్స్‌నే వాడుతున్నారు. అది సూచించిన దారిలో వెళ్తూ తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు గూగుల్‌ మాప్స్‌ను నమ్మి రాంగ్‌ రూట్‌లోకి కూడా వెళ్తారు. ఈ మధ్య ఏకంగా కొంతమంది నదులు, చెరువుల్లోకి వెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ కూడా గూగుల్ మ్యాప్‌ను నమ్మి ఏకంగా డ్యామ్‌లోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్‌ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్ల లోడ్‌ను వ్యాన్‌లో తీసుకెళ్తున్నాడు. తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. హుస్నాబాద్‌ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నాడు. అయితే డ్రైవర్‌కు ఈ రూట్‌ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాడు .

Also Read: ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ఈ క్రమంలోనే రామవరం వైపు కాకుండా గుడాటిపల్లి వైపుకు మళ్లాడు. మ్యాప్ కూడా అలాగే చూపించడంతో దాన్నే ఫాలో అయ్యాడు డ్రైవర్. అయితే కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీరు నిలిచాయేమోనని అనుకుని డ్రైవర్ ముందుకెళ్లాడు. కానీ ఒక్కసారిగా క్యాబిన్ వరకు నీళ్లు రావడంతో.. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ భయంతో ఈదుకుంటూ బయటికి వచ్చేశాడు. చుట్టుపక్కల ఉన్న స్థానికుల వద్దకు ఈ విషయం చెప్పడంతో.. ఆదివారం ఉదయం వారు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు.

నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టును కట్టడంతో దారి లేదని అక్కడి స్థానికులు చెప్పారు. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ వరకు నీరు నిలిచి ఉంటుందని తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఏ పెద్ద గోడను నిర్మించాలని.. లేకపోతే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న ఓ లారీ డ్రైవర్ కూడా గూగల్ మ్యాప్ చూసుకుంటూ వస్తూ ఈ ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడని స్థానికులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు