Abhilasha Rao: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ..తెలంగాణలో పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఇక ఇప్పటికే అధికార పక్షం అభ్యర్థుల జాబితాను వెల్లడించడం.. కాంగ్రెస్ (Congress) ఇంకా బీజేపీలు అభ్యర్థుల లిస్ట్ ను ప్రిపేర్ చేసేందుకు కసరత్తు చేస్తుండడంతో.. రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. అసమ్మతులు దార్లను వెతుక్కునే పనిలో పడ్డారు. దీంతో ఎవరు ఎప్పుడు తమ పార్టీకి షాక్ ఇస్తారో..ఏ పార్టీలోకి ఎవరు జంప్ అవుతారో అర్థం కాకుండా పరిస్థితులు మారాయి.
ఇక తాజాగా కాంగ్రెస్ కు పెద్ద షాకే తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి, కొల్లాపూర్ నియోజకవర్గవాసి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి (PCC Chief Revanth Reddy) ఆయన పంపారు.
జూపల్లి ఎఫెక్ట్..!
రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ లో చేరిన అభిలాషరావు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ.. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే ఆయనతో పాటు సీనియర్ నేత జగదీశ్వర్ రావు ఈ సారి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వీరి ఆశలు కాస్త అడియాశలయ్యాయి. అయితే ముందు నుంచి జగదీశ్వర్ రావు జూపల్లి రాకను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
అభిలాషరావు కారెక్కనున్నారా..!
జూపల్లి రాకను జగదీశ్వర్ రావు వ్యతిరేకించినా.. అభిలాష రావు మాత్రం స్వాగతించారు. కాని గత పది రోజుల నుంచి మాత్రం అభిలాష రావు ఇంకా జూపల్లి మధ్య వార్ మొదలైంది. జూపల్లి తనకు అదే విధంగా తన వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని ఆరోపిస్తున్న అభిలాష రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల తన అనుచర వర్గంతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన అభిప్రాయ సేకరణ చేశారు. దీంతో మాజీ మంతి చిన్నారెడ్డి, జూపల్లి అభిలాష రావును బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా కాని అభిలాష రావు తన రాజీనామాను పంపించారు. అయితే ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు.
Also Read: కేసీఆర్, రేవంత్‌పై బూతులతో విరుచుకుపడిన మైనంపల్లి