Dasarth Deep : ఈనెల 22న అయోధ్య(Ayodhya) లో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందరికీ ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరిపించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లను చేస్తోంది. బాల రాముని విగ్రహాన్ని ఇప్పటికే ఎంపిక చేసారు. అయోధ్యలో రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులను ప్రధాని మోదీ(PM Modi) ఆవిష్కరించారు. మిగతా ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. దేశంలోనే అయోధ్య రామ మందిరం(Ram Mandir) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడు ఇందులో మరో అదనపు ఘనత కూడా చేరనుంది. రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపనకు మరింత వెలుగునిచ్చేందుకు అదే రోజున అయోధ్యలో భారీ దీపాన్ని కూడా వెలిగించనున్నారు.
Also read:కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
అయోధ్యలోని రామ్‌ఘాట్‌లోని తులసిబారి దగ్గర 28 మీటర్ల వ్యాసం కలిగిన దీపాన్ని వెలిగించనున్నారు. ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ళ నూనె పడుతుందని చెబుతున్నారు. ఈ దీపం పేరు దశరథ్ దీప్(Dasarath Deep). దీని తయారీలో చార్‌ధామ్‌తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను ఉపయోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు.
దశరథ్ దీప్‌ను 108 మందితో కూడిన బృందం తయారు చేస్తున్నారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. దీపాన్ని వెలిగించడానికి 1.25 క్వింటాళ్ల పత్తితో వత్తిని కూడా తయారు చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్ద దీపంగా దశరథ్ దీప్ రికార్డులకెక్కనుంది. అందుకే గిన్నిస్ బుక్(Guinness Book) ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.