Adarsh Residency Hostel : రాజస్థాన్ కోటాలోని (Rajasthan Kota) బాయ్స్ హాస్టల్ (Boys Hostel)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.15కు లక్ష్మణ్ విహార్‌లోని ఆదర్శ్ రెసిడెన్సీ హాస్టల్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా, 6 గురు స్పలంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహారావ్ భీమ్ సింగ్ (MBS) ఆసుపత్రిలో చేర్పించారు. మరో 14 మంది మంటల నుంచి తప్పించుకునేందుకు భవనం మొదటి అంతస్తు నుంచి దూకగా ఒకరి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు.
దట్టమైన పొగలు కమ్ముకుని..
ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరించిన జిల్లా యంత్రాంగం.. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధం రావడంతో నిద్రలేచి తన గది నుంచి బయటకు వచ్చేసరికి ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. మెట్ల నిండా పొగలు కమ్ముకోవడం, భవనం నుంచి బయటకు వేరే మార్గం లేకపోవడంతో విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ భవనంలో 75 గదులు ఉండగా అందులో 61 గదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడంతో, కొంతమంది విద్యార్థులు భవనం పైకప్పుపైకి ఎక్కారు. మరికొందరు గోడలు, కిటికీల ద్వారా క్రిందికి దిగడానికి ప్రయత్నించారు. మరికొందరు మొదటి అంతస్తు నుంచి దూకడంతో కాళ్లకు గాయాలు అయ్యాయని వారు తెలిపారు.
ఇది కూడా చదవండి : Tillu Square: బాక్సాఫీస్ దగ్గర టిల్లూ జోరు.. అట్లుంటది సిద్ధూతోని!!
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు..
అయితే షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి దారితీసిందని, ఫోరెన్సిక్ బృందం ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా చర్యలను పాటించకపోవడం, అగ్నిమాపక ఎన్‌ఓసి (నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన హాస్టల్‌కు సీలు వేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించిందని కోట మున్సిపల్ కార్పొరేషన్ అధికారి రాకేష్ వ్యాస్ వెల్లడించారు.