తిరుమలలో వన్య ప్రాణుల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇటీవలే చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో సోమవారం ఒక చిరుతను అటవీశాఖ అధికారులు బంధించగా.. భక్తులకు మరో చిరుత కనిపించింది. అలిపిరి మెట్ల మార్గంలో నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని ఓ బాలుడు చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇది జరిగి కొద్ది సమయం కూడా గడవకముందే.. శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.
శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తిరుమల కాలినడక మార్గాల్లో చిరుతలు, ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినా వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ట్యాగ్ లను కట్టారు. ఈ ట్యాగ్ లపై తండ్రిపేరుతో పాటు మొబైల్ నెంబర్లను కూడా నమోదు చేస్తున్నారు.
ఏది ఏమైనా తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో వన్య ప్రాణుల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటువైపు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు వన్య ప్రాణుల సంచారంతో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ సిబ్బంది ఏర్పాటు చేస్తూ బందోబస్తును పెంచారు. భక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.