లడఖ్(ladakh) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. లడఖ్ లోని లేహ జిల్లాలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి దూసుకు పోయింది. దక్షిణ లడఖ్ లోని న్యోమాలోని ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం(accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్(rescue operation) కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో 8 మంది జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి వున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ట్రక్కు కరు గ్యారీసన్ ప్రాంతం నుంచి క్యారీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాన్వాయ్ లో భాగంగా లేహ్ నుంచి న్యోమా ప్రాంతానికి వెళుతుండగా సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రమాదం జరిగిందన్నారు.
ప్రమాద సమయంలో ట్రక్కులో పది మంది జవాన్లు వున్నట్టు చెప్పారు. ట్రక్కుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగి వుంటుందని లేహ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పీడీ నిత్య వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. వారిలో ఎనిమిది మంది అప్పటికే మరణించారన్నారు.
ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో జవాన్ మృతి చెందాడన్నారు. ప్రస్తుతం మరో జవాన్ పరిస్థితి విషమంగా వుందన్నారు. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. దేశానికి జవాన్లు చేసిన సేవలను తాము మరచి పోమన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.