బీహార్(Bihar) రాజధాని పాట్నా(Patna) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. సరన్ జిల్లాలోని సరయు నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుండడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ముగ్గురిని కాపాడినప్పటికీ మిగిలిన 18 మంది కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు , సహాయక సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో సిబ్బంది ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్, డైవర్లు ఈ మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Also read: గ్రాండ్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్..మూడుముళ్ళ బంధంతో… ఒక్కటైన జంట..!!
మతియార్ ఘాట్ సమీపంలో ఓ పడవలో 24 నుంచి 25 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా.. ఓ వైపునకే వచ్చేయడంతో పడవ ఒరిగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
అయితే జనం ఎందుకు పడవలో ఓ వైపునకే వచ్చారో తెలియదని మేజిస్ట్రేట్ వివరించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వారంతా రైతులే, డయారాలో వ్యవసాయ పనులు ముగించుకుని పడవలో ఇళ్లకు తిరిగి వస్తుండగా ఒకసారిగా సరయూ నదిలో పడవ బోల్తా పడింది.