Fire Accident in Haryana: హర్యానాలోని గురుగ్రామ్ లోని ఓ కార్ల వర్క్ షాపులో (Car Workshop) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 16 లగ్జరీ కార్లు దగ్థమయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం.మోతీ విహార్ ప్రాంతంలోని బెర్లిన్ మోటార్ వర్క్‌షాప్‌లో శనివారం తెల్లవారుజామున ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అయితే.. పదహారు లగ్జరీ కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేశారని.. ఇవన్నీ కాలి బూడిదయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వీటితోపాటు కొన్ని పాత వాహనాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు చెప్పారు. సమాచారమందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశామని పేర్కొన్నారు.
మెర్సిడెస్, ఆడి క్యూ 5, బీఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, వోల్వో, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, ఒపెల్ ఎస్ట్రా, జాగ్వార్‌తో పాటు పదహారు అత్యాధునిక కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేసి ఉంచారు. ఈ ప్రమాదంలో ఇవన్నీ బూడిదగా మారాయి. అగ్నిప్రమాదంలో కొన్ని స్క్రాప్డ్ వాహనాలు కూడా బూడిదైనట్లు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.
Also Read: రూ. 850 కోట్ల విలువైన రేడియో ఆక్టివ్ మెటీరియల్ స్వాధీనం!