Indians: ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని కొలంబో శివార్లలోని మడివేలా, బత్తరముల్లాతోపాటు నెగొంబో తదితర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్దనుంచి 158 ఫోన్లు, 16 ల్యాప్ టాప్‌లు, 60 కంప్యూటర్లను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ఓ బాధితుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే బాధితుల ద్వారా బలవంతంగా నగదు డిపాజిట్లు చేయిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు నెగొంబోలోని ఓ విలాసవంతమైన ఇంటి పై దాడి చేయగా...కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దుబాయ్, ఆఫ్గానిస్తాన్ వంటి దేశాల్లోనూ వీరి కార్యకలాపాలు బయటకు వచ్చాయి. వీరు ఆర్థిక అవకతవకలు, అక్రమ బెట్టింగ్, జూదం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.