హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్(హెచ్ ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడిపోయింది. సుందర్ నగర్ నుంచి సిమ్లాకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు మండీ ఎస్పీ సౌమ్య సాంబ శివన్ తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా వుందని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల కొండ చరియలు విరిగిపోయాయి. దీంతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఇది ఇలా వుంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. అహ్మదాబాద్ లో ఆగివున్న వాహనాన్ని మిని ట్రక్కు శుక్రవారం ఢీ కొట్టింది. ఖేడా జిల్లాలోని కపడ్ వంజి గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు చెప్పారు.