Jagan: ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓటమితో వైఎస్ ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘోర ఓటమితో బాధలోవున్న జగన్ ను ఓదార్చేందుకు ఎట్టకేలకు వీదేశాలనుంచి విజయమ్మ ఏపీకి చేరుకుంది. నేరుగా జగన్ నివాసానికి వెళ్లిన విజయమ్మ జగన్ కు అండగా నిలబడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో దగ్గరుండి గెలిపించి..
ఇక గత ఎన్నికల్లో దగ్గరుండి జగన్ ను గెలిపించిన విజయమ్మ..ఈసారి ఎన్నికల ముందు అమెరికా వెళ్లిపోయింది. అంతేకాదు తన కూతురు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను గెలిపించండి అంటూ వీడియో రిలీజ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. వైఎస్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు ఉన్నాయని, జగన్ తల్లి, చెల్లిని దూరం పెడుతున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ప్లీనరీ వేదికగా వైసీపీ నుంచి వైదొలిగి..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీ మహాసభగా భావించే ప్లీనరీ వేదికగానే తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కేవలం తన పదవికి మాత్రమే కాకుండా పార్టీ సభ్యత్వాన్నే ఆమె వదులుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. వైసీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలకు కారణమయ్యింది. ఆమె ప్రకటన చేస్తున్న సమయంలోనే సభలో వద్దు, వద్దు అంటూ వినిపించిన నినాదాలే అందుకు నిదర్శనం.
కూతురుకు మద్ధతుగా..
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజయమ్మవిజ్ఞప్తి చేశారు. 'కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా' అన్నారు. అయితే విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.