YS Jagan: మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. మొన్న వినుకొండలో హత్య జరగడంతో హుటాహుటిన బెంగుళూరు నుండి అమరావతి వచ్చారు జగన్. సాయంత్రం 4గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజులపాటు బెంగళూరులోనే జగన్ ఉండనున్నట్లు సమాచారం. అయితే, జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే ఢిల్లీలో నిరసనలు వంటివి చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు తమ పార్టీ ఎమ్మెల్యేలతో హాజరైన జగన్.. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో నిరసనకు దిగారు.
మొన్న ఢిల్లీలో ధర్నా..
వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నాలో ఊహించని రాజకీయ పరిణామాలో చోటు చేసుకున్నాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే నేతలు పాల్గొన్నారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ధర్నాలో కూర్చొని జగన్ కు తన మద్దతు ప్రకటించారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi), సంజయ్‌రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు సైతం జగన్ దీక్షకు హాజరై తమ మద్దతు తెలిపారు. జగన్ పోరాటానికి కూటమి మద్దతు ఉంటుందని ఆయా నేతలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.