YS Jagan: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పాయకరావుపేట, పెందుర్తి, నర్సీపట్నం నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఇప్పటికే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 838.. అందులో వైసీపీ బలం 615, కూటమి 215, 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మెజార్టీ బలం వైసీపీకి ఉండడంతో సీటు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు జగన్. ప్రలోభాలకు లొంగవద్దని ప్రజాప్రతినిధులకు ఆయన సూచనలు చేస్తున్నారు.