World Glaucoma Day 2024 : మన దేశంలో అంధత్వం పెద్ద సమస్య. దీనికి ప్రధానకారణాల్లో ఒకటి గ్లకోమా(Glaucoma). దేశంలో దాదాపుగా 11.9 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే కంటిశుక్లం(కాటరాక్ట్) తరువాత.. అత్యధికంగా ప్రభావాన్ని చూపించే సమస్య గ్లకోమా. దీనిలో పెద్ద సమస్య ఏమిటంటే.. ఇది ముదిరిపోయేవరకూ గుర్తించడం కష్టం. అంతా మామూలుగానే ఉంటుంది. కానీ, గుర్తించాకా.. దీనికి చికిత్స కూడా అంతే కష్టం. మన దేశంలో 12.8% ప్రజలను గ్లకోమా అంధులుగా చేస్తోంది. ఇంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టే గ్లాకోమా గురించి ఇప్పటికీ ప్రజలకు అవగాహన లేదు. అందుకే ప్రపంచ గ్లకోమా దినోత్సవం – ప్రపంచ గ్లకోమా వారాన్ని ప్రతి సంవత్సరం మార్చి 12 న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్లకోమా గురించి పూర్తిగా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..గ్లకోమా అంటే..
World Glaucoma Day 2024 : గ్లకోమా అంటే బాగా అర్ధం అయ్యేలా చెప్పుకోవాలంటే, మన శరీరంలో బీపీ ఎలాంటిదో.. కంటికి ప్రత్యేకంగా గ్లకోమా అలాంటిది. అంటే, కాంతిలో ప్రెషర్ (ఒత్తిడి) పెరగడం. బీపీ పెరిగితే గుండె జబ్బులు ఎలా అయితే వస్తాయో.. అదేవిధంగా కంటిలో ఒత్తిడి పెరిగితే గ్లకోమా వస్తుంది. బీపీ పెరగడం వలన గుండె ప్రమాదంలో పడి.. గుండెపోటు(Heart Attack) తో ఎలా అయితే ఆగిపోయే అవకాశాలుంటాయో అదే విధంగా కంటి ఒత్తిడి పెరిగి చివరికి గ్లకోమాగా కంటి చూపును చంపేస్తుంది. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు.. రక్తం ఎప్పుడూ శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది.. అందువల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది.. మరి అంత చిన్న కంటి(Eye) లో ఏమి ఉంటుంది? అని. నిజమే.. శరీరంలో రక్తం ఎలా అయితే ఉంటుందో.. మన కంటిలో కూడా ఒకరకమైన ద్రవం ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉండే కంటిలో ఈ ద్రవం ఎప్పుడూ తయారు అవుతూనే ఉంటుంది. అది బయటకు పోతూనే ఉంటుంది. ఇలా సైక్లిక్ గా ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ సైకిల్ చెదిరినపుడు అంటే ఎప్పుడైనా బ్రేక్ అయితే, కళ్లపై ప్రషర్ అంటే ఒత్తిడి పెరుగడం ప్రారంభం అవుతుంది. ఇది క్రమేపీ గ్లకోమాగా మరి అంధత్వానికి దారి తీస్తుంది. కంటిలో ఈ ఒత్తిడి పెరగడానికి కారణం ఇదీ అని స్పష్టంగా ఏదీ లేదు కానీ, అనారోగ్యకరమైన ఆహారం.. ఇప్పటి జీవన శైలిలో డిజిటల్ స్క్రీన్స్ పై గడిపే సమయం పెరిగిపోవడం కారణాలుగా చెబుతారు నిపుణులు. ఎప్పుడూ ఎక్కువగా మొబైల్, కంప్యూటర్ లతో గడిపేవారికి గ్లకోమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని వారంటారు.
Also Read: యూరిక్ యాసిడ్ ని తగ్గించడంలో యాలకుల పాత్ర ఎలాంటిందంటే!
చిక్కు అదే..
World Glaucoma Day 2024 : ఇప్పుడు చెప్పుకున్న బ్లడ్ ప్రెషర్ పెరిగితే దానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వాటిని గమనించి ట్రీట్మెంట్ తీసుకుంటే, గుండె జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, గ్లకోమా విషయంలో అలా ఉండదు. ఎందుకంటే, కంటిలో ఒత్తిడి పెరిగింది అనే విషయాన్ని మనం అంత తొందరగా గ్రహించలేం. కంటి చూపులో తేడా వచ్చినపుడు చేసిన పరీక్షల్లోనే ఒత్తిడి పెరిగింది అని తెలుస్తుంది. అప్పటికి అది గ్లకోమాగా మారిపోయి ఉంటుంది. ఎందుకంటే, కంటిలో పెరిగే ఒత్తిడి క్రమేపీ మన కంటి నుంచి మెదడుకు అనుసంధానంగా ఉండే ఆప్టిక్ నెర్వ్(కంటినాడి) పై ఒత్తిడి తీసుకువస్తుంది. ఈ ఒత్తిడి వలన ఆప్టిక్ నెర్వ్ దగ్గరగా అయిపోవడం ప్రారంభం అవుతుంది. అంటే నొక్కినట్టుగా అవడం ప్రారంభం అవుతుంది. అది అలా పెరిగి.. పూర్తిగా నొక్కుకుపోతుంది. అంటే ఒక ప్లాస్టిక్ పైపులో నీళ్లు వెళుతుండగా ఆ పైప్ పైన చేతితో ప్రెషర్ పెట్టి నొక్కితే ఎలా అయితే నీరు ఆగిపోతుందో.. అదేవిధంగా కంటి నుంచి మెదడుకు చేరే సిగ్నల్స్ మొత్తం ఆగిపోతాయి. దీంతో అంధత్వం వస్తుంది. సాధారణంగా, గ్లాకోమాను గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే దాని ప్రారంభంలో ఎటువంటి ముఖ్యమైన లక్షణాలు ఉండవు. ఈ కంటి వ్యాధి బాల్యంలో, యవ్వనంలో లేదా వృద్ధాప్యంలో ఎప్పుడైనా ప్రారంభమవుతుంది. సకాలంలో గుర్తించడం ద్వారా నివారించగల కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే..
- పెరిఫెరల్ విజన్ లాస్ (పరిధీయ దృష్టి నష్టం) : గ్లకోమా ప్రారంభ సంకేతంగా పెరిఫెరల్ విజన్ లాస్ ని చెప్పవచ్చు. అంటే కంటి నాడి నొక్కబడుతూ ఉండడం వల్ల మనం ఒక స్ట్రా లోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అయితే ఇది క్రమేపీ జరుగుతూ వస్తుంది. అందువల్ల బాగా ఎక్కువగా కంటి నాడి నొక్కుకుపోయే వరకు మనకు విషయం అర్ధం కాదు. ఇబ్బంది తెలియదు.
- కంటి నొప్పి – తలనొప్పి : యాంగిల్-క్లోజర్ గ్లాకోమా వంటి తీవ్రమైన సందర్భాల్లో, ఆకస్మిక కంటి నొప్పి, తలనొప్పి, వికారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
- లైట్ల చుట్టూ హాలోస్ : కొందరికి లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు రంగుల్లో హాలోస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తున్నపుడు ఎదురుగా వచ్చే వాహనాలనుంచి వచ్చే కాంతి చుట్టూ మనకు కనిపించే రంగుల వలయం లాంటిది.. మామూలుగా కూడా మసక చీకటి సమయంలో లైట్లను చూసినపుడు ఇలా కనిపిస్తే అది గ్లకోమాకు సూచనగా భావించవచ్చు.
- అస్పష్టమైన దృష్టి : వ్యాధి ముదిరే కొద్దీ, క్రమంగా చూపు మసకబారుతుంది.
- ఎర్రటి కళ్ళు : కంటిలో ఎటువంటి దుమ్ము, ధూళి పాడకపోయినా.. ఎలర్జీలాంటి ఇబ్బంది లేకపోయినా అంటే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా కన్ను ఎరుపుగా మారుతుంటే ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు.
- కంటి అద్దాలు మార్చాల్సి రావడం: కొంతమంది రోగులలో తరచుగా కంటి అద్దాలు మార్చాల్సి రావడం కూడా ప్రారంభ లక్షణం కావచ్చు
గ్లకోమా రావడానికి కారణాలు..
World Glaucoma Day 2024 : గ్లకోమా రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు వాటిలో కొన్ని..
- పెరుగుతున్న వయస్సు- కాటరాక్ట్ లానే గ్లకోమా బారిన పడే వారిలో ఎక్కువ మంది వృద్ధులే. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి చాలా సాధారణం. గ్లాకోమా కారణంగా వృద్ధులు కంటి చూపును కోల్పోవచ్చు.
- జన్యుపరంగా – కొందరిలో ఈ వ్యాధి జన్యుపరంగా కూడా రావచ్చు. అంటే, మీ కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉంటే, అది వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
- కంటి సమస్యలు- హ్రస్వదృష్టి (దగ్గరగా కానీ దూరంగా కానీ స్పష్టంగా కనిపించే పరిస్థితి) వంటి సమస్యలు కూడా వృద్ధాప్యంలో గ్లాకోమాకు కారణం కావచ్చు.
- మధుమేహం- ఈ వ్యాధి గ్లకోమాకు కూడా కారణం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
- హైపర్‌టెన్షన్- బీపీ ఎక్కువ ఉంటే గుండె జబ్బులు వస్తాయని తెలిసిందే. అయితే, బీపీ గ్లాకోమా ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండటం ద్వారా గ్లాకోమాను కూడా నివారించవచ్చు.
ట్రీట్మెంట్ ఎలా?
కళ్లలో ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్‌తో రెగ్యులర్ చెకప్‌లు, కళ్ల లోపల ఒత్తిడిని కొలవడం, విజువల్ ఫీల్డ్ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా గ్లాకోమా ప్రారంభ దశలను గుర్తించడానికి అవకాశం ఉంటింది. ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని సృజనాత్మక చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ కళ్ళకు స్నేహితుడిగా మారవచ్చు. అవేమిటంటే..
- మీ ఆహారంలో విటమిన్లు, సరైన మొత్తంలో ఖనిజాలు, పోషకాలు ఉండేలా చూసుకోండి. బచ్చలికూర, క్యారెట్, కివి, బొప్పాయి, నారింజ, చిలగడదుంప, వాల్నట్, సీడ్ ఐబాల్స్ వంటి ఆహరం తీసుకోవడం కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది
- ధ్యానా, యోగా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని ద్వారా కంటి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేలా చూసుకోవచ్చు.
- 20-20-20 నియమం అనుసరించండి. 20 నిమిషాలు స్క్రీన్ (కంప్యూటర్ లేదా మొబైల్) వద్ద గడిపిన తరువాత చిన్న బ్రేక్ తీసుకోండి. 20 సెకన్ల పాటు కళ్ళు మూసుకోండి. తరువాత 20 సెకన్ల పాటు దూరంగా ఉన్న వస్తువులు.. మొక్కలు.. పరిసరాలను చూడండి. ఆ తరువాత మీ పని మళ్ళీ మొదలు పెట్టండి. ఇలా మీరు స్క్రీన్ ముందున్నపుడల్లా 20-20-20 నియమం తప్పనిసరిగా పాటించండి.
- యాంటీ గ్లేర్ కంటి అద్దాలు తప్పనిసరిగా వాడండి. ఎక్కువసేపు కంప్యూటర్ పై పనిచేసేటపుడు నీలం రంగును డిమ్(తగ్గించే) చేసే కళ్లద్దాలు వాడడం మంచిది.
- రాత్రి సమయంలో చీకటిలో కూచుని టీవీ చూడడం లేదా ఎటువటిని డిజిటల్ స్క్రీన్ ఉపయోగించడం చేయవద్దు.
- చీకటి పడిన తరువాత మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి నైట్ మోడ్ ఆన్ చేసుకోండి.
- ఎప్పటికప్పుడు కంటి డాక్టర్ ను సంప్రదించి.. చెకప్స్ చేయించుకుంటూ ఉండండి.
గ్లకోమా అంటే ఏమిటో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు:
[vuukle]