World Cup Champions Team India Back To Home : T20 వరల్డ్ కప్ 2024 లో ఇండియా అత్యద్భుత విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ లీగ్ లో ప్రతీ మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన భారత జట్టు.. ఫైనల్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అదరగొట్టింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంది. అటు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టగానే ఘన స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భారత్ బృందం స్వదేశానికి రావాల్సి ఉండగా బెరిల్ హరికేన్ కారణంగా కొన్ని రోజులుగా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితులు మెరుగపడటంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బడోస్‌కు పంపింది. ఈ స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో రోహిత్‌శర్మ సేన, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబసభ్యులు బార్బడోస్ నుంచి బుధవారం బయల్దేరారు.
Also Read : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!
ఈ ప్రత్యేక విమానం గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలో ల్యాండ్‌కానుంది. ఉదయం 9.30 గంటలకు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి బయల్దేరుతారు. మోదీతో సమావేశంలో టీమ్ఇండియా ప్లేయర్స్ ప్రపంచ కప్ జర్నీ విషయాలను పంచుకోనున్నారు. అనంతరం భారత ఆటగాళ్లు మోదీతో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబయికి వెళ్తుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి బయల్దేరనుంది. వాంఖడేకు సమీపంలో రెండు కిలోమీటర్ల మేర నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్‌లో భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో సందడి చేయనున్నారు.