లిప్ స్టిక్ వేసుకునే ఆడవాళ్లకి రిజర్వేషన్ ఇవ్వడం ఎందుకు అంటున్నారు ఆర్జేడీ(RJD) సీనియర్ నేత ఒకరు. లిప్ స్టిక్ వేసుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టైల్ తో ఉండే ఆడవాళ్లు..మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ నానా రచ్చ చేస్తున్నారని ఆర్జేడీ నేత అబ్దుల్ బారి (Abdul Bari Siddiqui)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ లోని ముజాఫర్‌పుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాసైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అసలు లిప్ స్టిక్ వేసుకునే ఆడవారికి రిజర్వేషన్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నించారు.
రిజర్వేషన్లు అనేవి వెనుకబడిన వర్గాల మహిళలకు మాత్రమే ఇవ్వాలని, లిప్‌స్టిక్ పెట్టుకుని పోష్ గా ఉండే ఆడవాళ్ల విషయం లో అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు కూడా టీవీ, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలని ఆర్జేడీ మద్దతు దారుల్ని ఆయన కోరారు.
మన పూర్వీకులకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, మన పిల్లల్ని విద్యావంతులను చేసి, మన వాటా కోసం మనం పోరాడాలని ఆర్జేడీ నేత తెలిపారు.
చట్టంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకపోవడంతోనే సిద్దిఖీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు తెలిపారు. వెనకబడిన వర్గాల మహిళలకు చట్టంలో తగిన రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు సిద్దిఖీ.
ఆయన మహిళా రిజర్వేసన్ కు వ్యతిరేకమంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల విషయంలో ఆర్జేడీ అధికార ప్రతినిధి సిద్ధిఖీ మాత్రం ఆర్జేడీ నేత సిద్ధిఖీని సమర్థించారు. వెనకబడిన వర్గాల మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించపోతే రిజర్వేషన్ చట్టంతో ఎప్పటికీ న్యాయం జరగదని అన్నారు.
మహిళ రిజర్వేషన్ బిల్లును అప్పుడే అమలు చేయలేమని జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయడం సాధ్యమని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.