దేశంలో మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఏదోక మూల జరుగుతునే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరచిపోకముందే..అలాంటి ఘటనే ఒకటి బెంగాల్ లో జరిగింది.ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..
డార్జిలింగ్ జిల్లా లోయర్ బాగ్‌దోగ్రా ప్రాంతానికి చెందిన రోష్ని ఖేర్వార్ అనే మహిళకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ సర్కార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీని గురించి ప్రదీప్ భార్య ఆ మహిళతో పలుమార్లు గొడవ పడింది. అయినప్పటికీ కూడా ప్రదీప్ ఆ మహిళను కలుస్తూనే ఉన్నాడు. దీంతో స్థానికంగా పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రదీప్ భార్య తో రోష్ని గొడవకు దిగింది. ఆ సమయంలో ప్రదీప్ భార్య స్నేహితురాలు వీరిద్దరికి సర్ది చెప్పే క్రమంలో రోష్ని తో గొడవపడింది.
అంతేకాకుండా రోష్ని ఆ సమయంలోనే ఆమె పై చేయి కూడా చేసుకుంది. అయినప్పటికీ కూడా రోష్ని ప్రదీప్ భార్య స్నేహితురాలి పై కోపం పెంచుకుంది. గొడవ జరిగిన మరుసటి రోజు మరోసారి పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోష్ని తో పాటు ఆమె సన్నిహితులు కూడా ఆ గిరిజన మహిళ పై ఒక్కసారిగా దాడికి పాల్పడటమే కాకుండా..ఆమెను వివస్త్రను చేసి నిలబెట్టారు. అంతే కాకుండా దారుణంగా కొట్టారు.
ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ పెద్దలు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. జరుగుతున్న అమానవీయ ఘటనను ఒక్కరు కూడా అడ్డుకోకపోవడంతో బాధితురాలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం బాగ్డోగ్రా పోలీసు స్టేషన్ లో నిందితుల పై ఫిర్యాదు చేసింది. దాడి చేసిన నిందితులను తనను బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.