Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బహ్రెయిచ్ జిల్లాలో రాత్రిపూట ఇళ్లపై దాడులకు పాల్పడుతూ.. చిన్నారులను ఎత్తుకెళ్లి పీక్కుతింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండటం బాధకరమైన విషయం. కాగా తోడేళ్ల భయంతో దీంతో 24 గ్రామాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. రాత్రిపూట తోడేళ్లు దాడులు చేస్తుండగా స్థానికులు రాత్రంతా కాపలా ఉంటున్నారు. ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని మహిళలు పడుకుంటున్నారు.
అయితే నరహంతక తోడేళ్ల కోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హై ఫ్రీక్వెన్సి డ్రోన్ కెమెరాలతో తోడేళ్ల గుంపుల కోసం వెతుకులాట కొనసాగుతోందని, ఇప్పటివరకూ 3 తోడేళ్లను పట్టుకున్నట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు.