ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌లో ప్రతిపక్షాలు.. అధికార పార్టీ నాయకుల మధ్య వార్ నడుస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలోని ఏకైక క్రషర్‌ నుంచి 400 కోట్లు తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. మీరు చేసిన ఆరోపణల్ని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తానని ప్రతిపక్ష నాయకులకు మంత్రి సవాల్ విసిరారు.

New Update
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Will resign if allegations are proved Prashanth Reddy

ఆరోపణల్లో రుజువు లేదు

బాల్కొండ నియోజకవర్గంలోని ఏకైక క్రషర్‌ నుంచి రూ.400 కోట్లు తీసుకున్నట్లు తనపై ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను వారంలోగా రుజువు చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తనపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. బాల్కొండలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, కేజీబీవీలో నిర్మించిన నూతన భవనాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రషర్‌ మిషన్‌ కావాలంటే భూమితో సహా రూ.10 కోట్లకు ఇప్పిస్తానని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అన్నారు. చాలా ప్రాంతాల్లో తారు రోడ్లు వేయాల్సి ఉందని గుత్తేదారులు ముందుకొస్తే రూ.100 కోట్ల పనులు అప్పగిస్తామని చెప్పారు. గంజాయి అరికట్టడానికి పోలీసులతో సమావేశాలు నిర్వహించానన్నారు.

అధినేత అండతోనే

సీఎం కేసీఆర్‌ సహకారంతో రూ.114 కోట్లతో బాల్కొండను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. కల్యాణ మండపంలో వంట పాత్రలు, కుర్చీలను తన తండ్రి జ్ఞాపకార్థం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రహరీ నిర్మాణానికి రూ.9 లక్షలు మంజూరు చేస్తానన్నారు. మహిళా సంఘ భవనం నిర్మాణానికి నిధులు కేటాయిస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచిందని.. దీంతో సామాన్యులపై భారం పడిందన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు దాసరి లావణ్య, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ అరుణ, సర్పంచ్‌ భూస సునీత, ఎంపీటీసీ సభ్యురాలు లింగవ్వ, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఫయాజ్‌, రాకేశ్‌, సొసైటీ ఛైర్మన్‌ సూరజ్‌రెడ్డి, నాయకులు లింగాగౌడ్‌, వైఎస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు