మణిపూర్ వీడియోపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. నగ్నంగా ఊరేగించిన ఘటనపై హోంమంత్రి ఏమన్నారంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్‌ వీడియోపై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ వీడియోను కుట్రపూరితంగానే రిలీజ్ చేశారన్నారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐకి నివేదించామని మరో కేసును కూడా ఆ సంస్థ అధికారులు చేబట్టనున్నారని తెలిపారు.

New Update
మణిపూర్ వీడియోపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..  నగ్నంగా ఊరేగించిన ఘటనపై హోంమంత్రి ఏమన్నారంటే..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మణిపూర్(Manipur) వీడియోను సర్క్యులేట్ చేయడం చూస్తే ప్రాథమికంగా ఇది కుట్రేనని భావించవలసి వస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకే ఈ వీడియోను వైరల్ చేసినట్టు కనిపిస్తోందన్నారు. నిజానికి 2022లో మియన్మార్‌లో జరిగిన రెండు ఘటనలను కూడా మణిపూర్‌లో జరిగినట్టు రెండు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారని, పోలీసులు వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రంలో ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే వీటిని సర్క్యులేట్ చేశారన్నారు. మే 4న కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో సంబంధిత వీడియోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్టు చేశారని, అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఎన్‌ఐఏ దర్యాప్తు:

ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారని అమిత్ షా పేర్కొన్నారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐకి నివేదించామని మరో కేసును కూడా ఆ సంస్థ అధికారులు చేబట్టనున్నారని తెలిపారు. మణిపూర్ బయట ఈ కేసుల విచారణ సాగుతోందన్నారు. మరో మూడు కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ(NIA)కి అప్పగించామన్నారు.

కేంద్రం అఫిడవిట్

మణిపూర్ వీడియో కేసు విషయంలో కేంద్రం ఓ అఫిడవిట్ ను సుప్రీంకోర్టు(supreme court)లో దాఖలు చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించామని, నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేషన్ సాగుతోందని, మణిపూర్ లో కాకుండా మరో రాష్ట్రంలో అధికారులు దీన్ని చేబట్టనున్నారని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకే ఉందని ఈ అఫిడవిట్ లో వివరించారు. మహిళల పట్ల అఘాయిత్యాలు, దౌర్జన్యాలను సహించే ప్రసక్తే లేదని, ఇందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొంది. మణిపూర్ ప్రభుత్వ అనుమతిపై ఈ కేసును సీబీఐకి అప్పగించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ కేసును ఓ నిర్దిష్ట కాలవ్యవధిలోగా పరిష్కరించే విషయమై నిర్ణయం తీసుకునేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని అభ్యర్థించింది.

సుప్రీంకోర్టు సీరియస్

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు ఈ నెల 20 నే తీవ్రంగా స్పందించింది. హింసను రెచ్చగొట్టడానికి మహిళలను వినియోగించుకోవడం అత్యంత దారుణమని, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం అంగీకారయోగ్యం కావని పేర్కొంది. మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్నే తీసుకోమంటారా అని కోర్టు ఆగ్రహంగా ప్రశ్నించింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. కేంద్రాన్ని, మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు