Wild Bear trapped in to Cage at Sikhareswaram in Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది.
స్వామి వారికి భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పలు తింటూ అర్ధరాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో సంచరిస్తుంది. దీంతో భక్తులు ఎలుగు బంటిని వీడియోలు, ఫొటోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. అయితే తిరుపతిలో జరిగిన ఘోర ఘటనల దృష్ట్యా శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్ చాంగ్ తెరాన్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.
మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగు బంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.