కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి కారణాలేంటి.. వ్యూహమా? భయమా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే కేసీఆర్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేయడానికి కారణాలు ఏంటి? రాజకీయ వ్యూహమా? ఓటమి భయమా? రీడ్ దిస్ స్టోరీ.

కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి కారణాలేంటి.. వ్యూహమా? భయమా?
New Update

రాజకీయ వ్యూహంలో భాగమేనా..! 

ఎన్నికల యుద్ధానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కాలు దువ్వారు. ఇందులో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగా 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే కేసీఆర్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి అలవోకగా విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే గజ్వేల్‌లో ఓడిపోతారనే భయంతోనే రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ కేసీఆర్ వ్యూహం మాత్రం వేరుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

35 స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా..

కామారెడ్డి నుంచి పోటీచేయడానికి బలమైన కారణం ఉందంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి పోటీ చేస్తే అక్కడ ఉన్న 10 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలాగో 10కి 9 స్థానాలో బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 24 స్థానాల్లో(పాతబస్తీ కాకుండా) ఎక్కువ సీట్లు గెలిచేలా ప్లాన్ చేశారు. కామారెడ్డిలో ఎక్కువగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ముస్లింల ఓట్లు పొందేందుకు స్కెచ్ వేశారు. ఉత్తర తెలంగాణలో 35 స్థానాల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక మిగిలిన 35 స్థానాలు దక్షిణ తెలంగాణలో గెలిస్తే మరోసారి సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుందని గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది.

కవిత రాజకీయ భవిష్యత్ కోసమేనా..!

ఇక దీంతో పాటు కామారెడ్డి నియోజవర్గంతో కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పూర్వీకుల గ్రామం ఆ నియోజవర్గంలోనే ఉంటుంది. అందుకే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోవడంతో కేసీఆర్ కుటుంబం ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడకకు వలస వెళ్లింది. ఈ కారణమే కాకుండా మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. గులాబీ పార్టీకి తొలి నుంచి ఉత్తర తెలంగాణలో పట్టు లేదు. దీంతో ఆక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ పోటీ చేస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇదంతా కాదు అసలు మ్యాటర్ వేరేది ఉందంటున్నారు మరి కొంతమంది. తన ముద్దుల కూతరు కవిత రాజకీయ భవిష్యత్ కోసమే కామారెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ ఎంపీ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు కవిత. ఒకవేళ ఆ ఎన్నికల్లో ఎంపీగా కవిత మళ్లీ ఓడిపోతే ఆమె రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కామారెడ్డిని ఎంచుకున్నట్లు పేర్కొంటున్నారు. ఎందుకంటే రెండు స్థానాల్లో కేసీఆర్ విజయం సాధిస్తే ఓ చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కామారెడ్డి సీటు నుంచి రాజీనామా చేసి.. కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మమతాకు జరిగిన పరిణామాల నేపథ్యంలోనా..? 

మరోవైపు రెండు సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా ఉన్న మమతా బెనర్జీ తన ప్రత్యర్థి సువేందు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆరు నెలల లోపు మరో స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆమె సీఎం పదవికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe