Kerala: వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే?

కేరళలోని వయనాడ్‌ ప్రకృతి సృష్టించిన ప్రళయంలో ఇప్పటివరకు 174 వరకు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే.. వందాలదిగా శవాలు బురద కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య వేయి దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Kerala: వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే?

Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌ లో మంగళవారం తెల్లవారుజామున ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపిన సంగతి తెలిసిందే.. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు సుమారు 1000 మందికి పైగా ప్రజలు చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతుండడమే దీనికి కారణం.

కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలన్ని బురదతో నిండిపోయాయి. ఆ బురదలో కొన్ని వందల మంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఎక్కడ ఏ శవం ఉందో తెలియని దారుణమైన పరిస్థితి వయనాడ్ లో కనిపిస్తోంది. దీంతో అధికారులు, సహాయక సిబ్బంది జాగ్రత్తగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాధితుల రోదనలు, శవాలు, ఆర్తనాదాలతో అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా మారింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు 174 మంది వరకు చనిపోగా..600 మంది కార్మికులు కనిపించకుండా పోయారు. అసలు ఈ స్థాయిలో ప్రకృతి ప్రకోపానికి కారణం ఏంటి? అంటే వాతావరణ మార్పులే అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.కేరళ వయనాడ్​లో కొండచరియలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

30 ఉంటే అందులో 10 కేరళలోనే..

భారతదేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లాల్లో వయనాడ్ 13వ స్థానంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023 లో విడుదల చేసిన ల్యాండ్​స్లైడ్​ అట్లాస్ వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడే 30 జిల్లాల్లో 10 జిల్లాలు ఒక్క కేరళలోనే ఉన్నాయి.

కేరళ కొండచరియలు ప్రధానంగా తోటల ప్రాంతాల్లో సంభవించాయని 2021 అధ్యయనం వివరించింది. 56 శాతం ప్లాంటేషన్​ ప్రాంతాల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయని అధ్యయనంలో తెలిసింది.

2022 అధ్యయనం ప్రకారం, 1950 నుంచి 2018 మధ్య వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో 62 శాతం అటవీ ప్రాంతం కరిగిపోయింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, 1950ల వరకు, వయనాడ్ మొత్తం విస్తీర్ణంలో 85 శాతం అటవీ ప్రాంతం ఉన్నట్లు సమాచారం. అది ప్రతి సంవత్సరం తరిగిపోతూ వస్తోంది.

అరేబియా వేడెక్కడమే కారణమా..!

అరేబియా సముద్రం వేడెక్కడం రాష్ట్రంలో అత్యంత భారీ, అనూహ్య వర్షపాతానికి కూడా ఒక కారణమని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్​డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ వివరించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం వెచ్చగా మారుతోందని, దీనివల్ల కేరళ సహా ఈ ప్రాంతంపై వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎస్.అభిలాష్ వివరించారు.

2019 కేరళ వరదల తర్వాత డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ట్రెండ్ కనిపిస్తోందని అభిలాష్ పేర్కొన్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేఘ వ్యవస్థలు తక్కువ సమయంలో అతి భారీ వర్షాలకు కారణమవుతాయని, ఇది కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

మైనింగ్..ప్రధాన కారణమా!

వయనాడ్ పర్వత శ్రేణులను పర్యావరణపరంగా సున్నితమైనవిగా ప్రకటించాలని 'పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ' పేర్కొంది. అత్యంత సున్నితమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, విచ్చలవిడిగా జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్‌ వివరించింది.

పర్యావరణపరంగా సున్నితమైన జోన్ 1గా పరిగణించే ఈ ప్రాంతంలో మైనింగ్, క్వారీయింగ్, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున పవన విద్యుత్ ప్రాజెక్టులను నిషేధించాలని ఎప్పటి నుంచో సిఫార్సులు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవి ఆగకపోవడం వల్లే ఇలా విపత్తులు సంభవించి ప్రజలను మింగేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి కొన్ని రోజులు భారీ వర్షాలు!

వయనాడ్​ విపత్తుతో ఉలిక్కిపడిన కేరళకు మరో చేదు వార్త ను అందించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

Advertisment
తాజా కథనాలు