Waynad Landslides : వయనాడ్‌ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..?

కేరళలో మంగళవారం తెల్లవారు జామున వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన దారుణ ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 287చేరింది. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

New Update
Waynad Landslides : వయనాడ్‌ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..?

Kerala : కేరళలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం తెల్లవారు జామున వయనాడ్‌ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్‌ నామారూపాలు లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ప్రజలు నివసించే వారు అనే చెప్పుకొనే పరిస్థితులు వయనాడ్‌ లో కనిపిస్తున్నాయి.

ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 287చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నుంచి అధికారులు, సహాయక బృందాల వారు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు మొదలు పెట్టారు.

వయనాడ్‌లోని కొండ ప్రాంతాల్లో టీఎస్టేట్‌లు ఎక్కువగా ఉండటంతో అక్కడ పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఇక్కడకి కుటుంబాలతో సహా ఇక్కడ కాపురాలు ఉంటారు. అలా వలస వచ్చిన వారిలో 600  కార్మిక కుటుంబాలు అసలు ఏమైయ్యారో అనే విషయం ఇప్పటికీ తెలియలేదు.

సహాయక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఇక ఎగువ నుంచి కొండచరియలు, బురద విపరీతంగా పేరుకుపోవడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా తయారు అయ్యాయి. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వయనాడ్​లో కొండచరియలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023 లో విడుదల చేసిన ల్యాండ్​స్లైడ్​ అట్లాస్ వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడే 30 జిల్లాల్లో 10 జిల్లాలు ఒక్క కేరళలోనే ఉన్నాయి.

అరేబియా సముద్రం వేడెక్కడం రాష్ట్రంలో అత్యంత భారీ, అనూహ్య వర్షపాతానికి కూడా ఒక కారణమని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్​డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ వివరించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం వెచ్చగా మారుతోందని, దీనివల్ల కేరళ సహా ఈ ప్రాంతంపై వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎస్.అభిలాష్ వివరించారు.

అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేఘ వ్యవస్థలు తక్కువ సమయంలో అతి భారీ వర్షాలకు (Heavy Rains) కారణమవుతాయని, ఇది కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

వయనాడ్ పర్వత శ్రేణులను పర్యావరణపరంగా సున్నితమైనవిగా ప్రకటించాలని ‘పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ’ పేర్కొంది. అత్యంత సున్నితమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, విచ్చలవిడిగా జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్‌ వివరించింది.

ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షించేందకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు నిర్మించాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ గురువారం పర్యటించబోతున్నారు.

ఇదిలా ఉండగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిలీ అనే తాత్కాలిక వంతెనలను నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాలలో ఈ వంతెనలను సహాయక బృందాలు నిర్మించాయి. వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్‌ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకుని వెళ్లవచ్చు.

తమ రాష్ట్రంలో ఇటువంటి విషాదాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాతో ప్రస్తావించారు. 'మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 219 మందిని ఆసుపత్రుల్లో చేర్చాం. వారిలో 78 మంది తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించాం". అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గురువారం వయనాడ్​లో సీఎం అధ్యక్షతన అఖిల సమావేశం జరగనుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. సహాయక శిబిరాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటించనున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు కేరళలోని ఐదు జిల్లాలకు రెడ్​ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో 10 జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

Also read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ అత్యాచారం

Advertisment
తాజా కథనాలు