Former APCC President Sailajnath: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నీటి పంపకాలు శత్రుత్వంతో కాకుండా సోదరభావంతో పంచుకోవాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ సూచించారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో నాయకులు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. ఉమ్మడి రాష్ట్రం భౌగోళికంగా విడిపోయిన మానసికంగా కలిసే ఉన్నాయన్నది గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం
ఏ రాష్ట్రానికి ఎంత నీరు ఇవ్వాలన్నది బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికీ నిర్ణయించిందని దాని ప్రకారం పంపకాల చేస్తే సరిపోతుందన్నారు. కృష్ణ బేసిన్ లో పంపకాలకు ఇంకా ఏమి మిగలలేదని.. గోదావరి జలాలు ప్రతి ఏటా వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని ఆ నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లా కోసం రూపొందించారని. ఇక్కడ చెరువులన్నీ నింపి 33 లక్షల మందికి తాగునీరు అందించిన తర్వాతనే పక్క ప్రాంతాలకు తీసుకెళ్లాలని అన్నారు.
Also Read: కడపలో ఫ్లెక్సీల రగడ.. స్టేషన్ ఎదుట జనసైనికుల ఆందోళన
ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు నీటి కేటాయింపులు జరిగినా రాయలసీమ కరవును చూపించే అడిగారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే విధంగా నేతలు వ్యవహరించడం సరైనది కాదని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కృష్ణాజలాల వాటాలపై రెండు రాష్ట్రాల్లో మంత్రులు మాటల యుద్ధం చేశారు.