రష్యా అండతోనే ఎదిగిన వాగ్నర్ ముఠా ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది. By Vijaya Nimma 25 Jun 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి వాగ్నర్ గ్రూప్... ఒక సాధారణ సాయుధ కిరాయి ముఠా. దాన్ని పెంచి పోషించి.. సిరియా, లిబియా, మొజాంబిక్, మడగాస్కర్.. ఇలా అనేక దేశాల్లో తన ప్రయోజనాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాడుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం వరకు ఈ ప్రైవేట్ సైన్యం గురించి.. దాని అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ గురించి అంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రపంచాన్ని, పుతిన్‌ను ఉలిక్కిపడేలా చేశాడు ప్రిగోజిన్. పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం అదృష్టం కలిసొస్తే దొంగైనా దొర అవుతాడు. ప్రిగోజిన్‌కూ ఇలానే అదృష్టం కలిసొచ్చింది. 1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన చరిత్ర ఈ వాగ్నర్ ముఠా అధిపతిది. జైలు నుంచి విడుదలైన తర్వాత రకరకాల వ్యాపారాలు చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పలు రెస్టారెంటులు నెలకొల్పారు. ఇక్కడే పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. క్రమంగా అతడు అధ్యక్షుడి ఆంతరంగికుల్లో ఒకడిగా ఎదిగారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్‌గానూ పనిచేశారు. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఈయనవే. దీంతో పుతిన్ వంటగాడని అందరూ పిలిచేవారు. అలా అంచెలంచెలుగా అధ్యక్షుడి అండతో ఆర్థికంగా ఎదిగి.. వాగ్నర్ ముఠాకు ప్రిగోజిన్ అధినేత అయ్యారు. వాగ్నర్ గ్రూప్‌కు ఎదురులేదు ఏదైనా దేశానికి సైన్యం పంపిస్తే... అది చేసే ఎలాంటి కార్యకలాపాలకైనా ఆ దేశం బాధ్యత వహించాలి. అదే అనధికారికంగా కిరాయి ముఠాను పంపిస్తే.. జవాబుదారీతనం ఉండదు. ఈ ఆలోచనలోంచి పుట్టిందే వాగ్నర్ ప్రైవేటు సైన్యం. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ దీని వ్యవస్థాపకుడు. జర్మనీ నియంత హిట్లర్‌కు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నర్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. ఉత్కిన్- ప్రిగోజిన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిగోజిన్ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండటంతో వాగ్నర్ గ్రూప్‌కు ఎదురు లేకుండా పోయింది. ట్రంప్‌నకు అనుకూలంగా ప్రిగోజిన్ ప్రచారం వాగ్నర్ ముఠాను.. రష్యా సైన్యానికి అనుబంధ సంస్థ అంటారు. పుతిన్ కనుసన్నల్లో నడిచే ఈ ముఠా కార్యకలాపాలు 2015-21 మధ్యలో 27 దేశాలకు విస్తరించాయి. లిబియా అంతర్యుద్ధం, సిరియా, మొజాంబిక్, మాలి, సుడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజువెలా వంటి దేశాల్లో వాగ్నర్ గ్రూప్ ఉంది. ముఖ్యంగా సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది. 2014లో తొలిసారి క్రిమియా ఆక్రమణలో వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు బయటికి వచ్చాయి. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్ అని ఆరోపణలు ఉన్నాయి. ఖైదీలే.. 50 వేల సైనికులు వాగ్నర్ బృందంలో 90 శాతం మంది ఖైదీలే అని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. హత్య, ఇతర క్రూర నేరాలు చేసిన వ్యక్తులను వాగ్నర్ ముఠా.. సైనికులుగా చేర్చుకుంటోంది. కొన్ని సందర్భాల్లో వీరికి సాధారణ రష్యా సైనికుడికంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6 వేల మంది ఉన్నారు. తాజాగా ఆ సంఖ్య 50 వేలకు చేరుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి