తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులూ, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని నస్కల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరదలు రావడంతో వాగుకు జల ప్రవాహం కొనసాగుతోంది. నస్కల్ వాగు ఉగ్రరూపం దాల్చడంతో వరదనీరు జిల్లాలోని ప్రధాన రహదారుల నుంచి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరిసర గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీగా వరద నీరు వస్తుండటంతో వికారాబాద్ నుంచి వచ్చే వాహనదారులు మన్నెగూడా నుంచి రావాలని అధికారులు సూచించారు. మరోవైపు జిల్లాలోని పరిగి రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. మరోవైపు వాగు సమీపంలో ఉన్న సొండేపూర్‌లోని చెరువుకు గండి పడింది. దీంతో చేరువు క్రింద ఉన్న పంటపొలాలు దెబ్బతిన్నాయి. పంటపోలాలు దెబ్బతిన్న పరిసర ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిశీలించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. దీంతోపాటు ముంపు ప్రాంతాలకు చెందిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ శాఖ.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.