అది 2020 అక్టోబర్.. ప్రాంతం విజయవాడ-విద్యాధరపురం.. అప్పటికీ వాన దంచికొడుతోంది. అయితే కరెంట్ మాత్రం పోలేదు. దీంతో శివశంకరరావు అనే వ్యక్తి ఇంట్లో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాడు. అతనికి తెలియదు కాసేపట్లో అతనే ఓ న్యూస్ కాబోతున్నాడని..! అతను టీవీ చూస్తుండగా సడన్‌గా ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.. ఏం జరిగిందో తెలుసుకునేలోపే శివశంకరరావు శవమయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు అతని ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడలో వర్షం పడిన ప్రతీసారి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇలాంటి భయాలతోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా భారీ వర్షాలకు విజయవాడ- మొగల్రాజపురం వద్ద కొండచరియలు విరిగిపడగా.. ఓ బాలిక చనిపోయింది..!
హృదయవిదారక దృశ్యాలు
అప్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడపై వరుణుడు ఏకధాటిగా దాడి చేస్తున్నాడు. ఈ కుంభవృష్టికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సంబంధిత ఇళ్లలో పలువురు చిక్కుకుపోవడం వారికి గాయాలవడం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాలలో చిక్కుకున్న ఓ యువతిని బయటకు తీస్తున్న వీడియో గుండెల్ని పిండేసేలా ఉంది. శిథిలిల కింద చిక్కుకున్న యువతి ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుందో వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఇంద్రకీలాద్రిపై అనేక ప్రమాదాలు
నిజానికి విజయవాడలో కొండచరియలు విరిగిపడి ప్రజలు మరణించడం ఇదేం తొలిసారి కాదు. గత పదేళ్లలో విజయవాడలో కొండచరియలు విరిగిపడి 20 మందికి పైగా చనిపోయారు. అక్కడి అమ్మవారి ఇంద్రకీలాద్రిపై అనేకసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. వివిధ ఘటనల్లో చాలా మందికి గాయాలయ్యాయి. ఇక ఇంద్రకీలాద్రితో పాటు కస్తూరిబాయ్ పేటలో వర్షాలు కురిసినప్పుడు కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడిన ఘటనలున్నాయి. ఈ కస్తూరిబాయి పేట లబ్బీపేటలో ఉంది. 2023 జులైలో ఇక్కడ కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. అప్పుడు నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఈ ప్రాంతాలు డేంజర్
ఇక ప్రస్తుతం విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో కొండ ప్రాంతాల్లో నివసించే వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం, చిట్టినగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అన్నీ నోటి మాటలేనా?
నిజానికి మెట్ట ప్రాంతాల్లో నివాసముంటున్న వారిలో ఎక్కువగా పేద కుటుంబాలే ఉంటాయి. ఎడతెరిపి లేని వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దీంతో వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎన్నోఏళ్లుగా అక్కడి నివాసితులు కోరుతున్నారు. వాస్తవానికి విజయవాడలోని 30శాతం ప్రజలు కొండ భూభాగాల్లోనే నివసిస్తున్నారు. 2017లో వీరి రక్షణ కోసం ప్రొటెక్షన్ వాల్‌తో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) చెప్పింది. అయితే తర్వాత అసలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
పట్టణాభివృద్ధితో పెరిగిన ముప్పు
వర్షాలు కురిసినప్పుడు విజయవాడలో కొండచరియలు విరిగిపడడానికి అనేక కారణాలున్నాయి. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మృదువైన అవక్షేపణ శిలలను కలిగి ఉంటాయి. ఇవి భారీ వర్షాల సమయంలో ఈజీగా కోతకు గురవుతాయి. ఇక వేగవంతమైన పట్టణాభివృద్ధి కూడా ఈ ప్రమాదాలకు ఒక కారణం. విజయవాడలో అటవీ నిర్మూలన వేగంగా జరిగింది. ఇక పేలవమైన భూ నిర్వహణతో పాటు విజయవాడ చుట్టూ ప్రాంతాల్లో జరిగే వ్యవసాయ పద్ధతులు నేల కోతకు దారితీస్తున్నాయి.
డ్రైనేజీ వ్యవస్థ.. నిర్మాణ కార్యకలాపాలు
ఇక విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ ఏ మాత్రం సరిగ్గా ఉండదు. అందుకే వర్షాలు కురిసినప్పుడు నీళ్లు నిలిచిపోతాయి. ఇవి వరదలకు కారణం అవుతాయి. ఇది కొండచరియలు విరిగిపడే అవకాశాలను పెంచుతాయి. అటు వేగంగా కదులుతున్న నిర్మాణ కార్యకలాపాలు అక్కడి మట్టిని కాంపక్ట్ చేస్తాయి. అంటే నీటిని గ్రహించే సామర్థ్యాన్ని మట్టి కోల్పోతుంది. ఇది కూడా కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా అనేక కారణాలు విజయవాడలోని కొండచరియలు విరిగిపడే ఛాన్సులను పెంచుతున్నాయి. ఇదంతా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియనిది కాదు.. అయితే ప్రమాదం జరిగినప్పుడు కాస్త హడావుడి చేయడం తర్వాత VMC అధికారులు సైలెంట్‌గా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: ఆ సైట్స్‌లో 96శాతం ముఖాలు ఒరిజినల్.. బాడీలు మాత్రం ఎవరివో.. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీపై సంచలన నివేదిక!