Vijaya Nirmala: దర్శకురాలిగా ప్రపంచ రికార్డు విజయం.. నటిగా ప్రేక్షకుల మదిలో నిర్మలమైన స్థానం 

నటిగా..దర్శకురాలిగా తనదైన ముద్రవేసిన విజయనిర్మల జయంతి ఈరోజు. 1946 ఫిబ్రవరి 20న విజయనిర్మల జన్మించారు. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కిన ఆమె జీవిత విశేషాల కథనం ఇది. పై టైటిల్ క్లిక్ చేసి ఆర్టికల్ చూడండి.

Vijaya Nirmala: దర్శకురాలిగా ప్రపంచ రికార్డు విజయం.. నటిగా ప్రేక్షకుల మదిలో నిర్మలమైన స్థానం 
New Update

Vijaya Nirmala: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం. నిలదొక్కుకున్నా.. చాలారోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం ఇంకా కష్టం. ఇప్పుడు ఇంకా ఫర్వాలేదు. హీరోయిన్ గా నటించేవారి విషయంలో సమాజంలో పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ.. 60, 70 దశకాల్లో అయితే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సినిమాల్లోకి ఆడపిల్లలు వెళ్లడాన్ని చాలా తప్పుగా భావించేవారు. సినిమాల్లోకి వెళ్లడం మాట అటుంచితే.. సినిమాలు పిల్లలు చూడటం అంటేనే అదో పెద్ద చెడ్డ వ్యవహారంలా చూసేవారు. అలాంటి సామాజిక పరిస్థితుల మధ్యలో ఒక మహిళ బాలనటిగా సినిమాల్లోకి వచ్చి.. హీరోయిన్ గా ఎదిగి.. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు సృష్టించడం అంటే.. అది మామూలు విషయం కాదు. ఎంత ఎదిగినా హుందాగా వ్యవహరిస్తూ మచ్చలేకుండా సినీ ప్రస్థానాన్నికొనసాగించి.. మరణం తరువాత కూడా జనహృదయాల్లో ప్రత్యేకంగా ముద్రవేసుకున్న మహిళలు చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన మహిళ విజయనిర్మల(Vijaya Nirmala). నటిగా.. దర్శకురాలిగా.. ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. ప్రపంచంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన దార్శనికురాలు ఆమె. వ్యక్తిగత జీవితంలో భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. పునర్వివాహం చేసుకున్నా.. ఎక్కడా కూడా హుందాతనాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ విజయనిర్మల విషయంలో తప్పుగా.. తక్కువగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకురానివ్వలేదు. ఇప్పటి సినిమా నటీమణులు అందరూ కచ్చితంగా హుందాగా జీవించే విషయంలో ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అనడం అతిశయోక్తి కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న విజయనిర్మల జయంతి ఈరోజు (ఫిబ్రవరి 20). ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను మీకోసం అందిస్తున్నాం. 

విజయనిర్మల బాల్యం..

విజయనిర్మల(Vijaya Nirmala) 20 ఫిబ్రవరి, 1946న పుట్టారు. విజయనిర్మల పుట్టిన ఊరు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు. నరసరావుపేట లోని  పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. అక్కడి రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తరువాత విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే అప్పటికే సినిమాల్లో నిర్మల పేరుతో ఒకరు (నిర్మలమ్మ) ఉండడంతో తన పేరు మార్చుకున్నారు. తనకు సినీరంగంలో మొదటి అవకాశం ఇచ్చిన విజయా స్థూడియోస్ కు కృతజ్ఞతగా విజయనిర్మలగా తన పేరు మార్చుకున్నారు. 

సినిమాల్లో నటిగా..

కేవలం ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం “మత్స్యరేఖతో” సినీరంగ అరంగేట్రం చేశారు విజయనిర్మల(Vijaya Nirmala).11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు తెరకు వచ్చారు. తెలుగులో “రంగులరాట్నం” చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు.నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. విజయ నిర్మల బాలనటిగా కెరీర్ ప్రారంభించి,సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్ గా మంచి స్థాయిలో నిలిచారు. హీరోయిన్ గా వందకు పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణతో (47 సినిమాల్లో) ఎక్కువ సినిమాల్లో నటించారు. 

రెండో పెళ్లి.. 

విజయనిర్మల(Vijaya Nirmala) మొదటి భర్త కృష్ణమూర్తి కృష్ణ మూర్తి. అయితే, సినిమాల్లో నటిస్తున్న క్రమంలో సూపర్ స్టార్ కృష్ణతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది క్రమేపీ ఇద్దరూ కలిసి జీవించాలి అనుకునేంత గాఢంగా మారింది. అప్పటికే కృష్ణకు కూడా వివాహం అయింది. ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. అయినా ఇద్దరూ  తమ ఇష్టం మేరుకు సినీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇద్దరూ పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నారు. కృష్ణ- విజయనిర్మల ఇద్దరి దాంపత్యం వారి మారణం వరకూ కొనసాగింది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, సినిమా నటీ,నటుల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు చాలా అరుదుగా మాత్రమే కలకాలం నిలుస్తాయి. అందులోనూ ఇలా రెండో పెళ్లి వ్యవహారాలు ఏవీ సక్రమంగా సజావుగా సాగినట్టు చరిత్రలో లేదు. బాలీవుడ్ లో అలా ధర్మేంద్ర, హేమామాలిని కలిసి తమ జీవితాన్ని గడిపారు. టాలీవుడ్ లో కృష్ణ-విజయనిర్మల అలా హుందాగా జీవించారు. 

Also Read: ఫుల్లుగా మందేసిన చిరుత.. ఆడేసుకున్న జనాలు!

దర్శకురాలిగా..

విజయనిర్మల(Vijaya Nirmala) హీరోయిన్ గా చేస్తున్న కాలంలోనే దర్శకత్వంపై ఇష్టాన్ని పెంచుకున్నారు. సాక్షి సినిమాలో చేసిన టైం లోనే బాపు దగ్గర స్టోరీ బోర్డు రాయడం.. స్క్రీన్ ప్లే విధానం వంటి దర్శకత్వానికి అవసరమైన విషయాలు నేర్చుకున్నారు. అయితే, న‌టిగా నిల‌దొక్కుకుంటున్న స‌మ‌యంలోనే ద‌ర్శ‌క‌త్వం గురించి కృష్ణ‌తో చర్చించారు. కానీ,  ఈ ద‌శ‌లో న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం రెండూ ప‌డ‌వ‌ల ప్ర‌యాణం వ‌ద్దు కొంత కాలం ఆగు`అంటూ కృష్ణ ఆమెను ఆపారు. తరువాత  దాంతో న‌టిగా 100 సినిమాలూ పూర్తి చేసి.. అప్పుడు ద‌ర్శ‌కురాలిగా మారారు. మొద‌ట ఆమె `క‌విత‌` సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ అది మ‌ల‌యాళ సినిమా కావ‌డంతో తెలుగులో లెక్క‌లోకి రాలేదు. తెలుగులో ఆమె మొదట దర్శకత్వం వహించిన సినిమా మీనా. ఇది సూపర్ హిట్. ఈ సినిమా గురించి ఒక విషయం ఆసక్తిగా ఉంటుంది. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి నవలా రచయిత్రిగా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆమె రాసిన మీనా అనే నవలను విజయనిర్మల(Vijaya Nirmala) సినిమాగా తీశారు. ఈ సినిమా హిట్ కావడమే కాదు.. అప్పట్లో ఉద్దండులైన దర్శకులు విజయనిర్మల దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రసిద్ధ దర్శకులు పి. పుల్ల‌య్య‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మంచి కామెంట్లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో తెలుగు న‌వ‌ల‌లు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. కానీ వాటికి త‌గిన న్యాయం జ‌ర‌గలేదు. ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మాత్రం `మీనా`కు పూర్తి న్యాయం చేసింద‌ని ప్రశంసించారు పుల్ల‌య్య‌. అలా దర్శకురాలిగా ఆమె 44 సినిమాలు పూర్తి చేశారు. మహిళా దర్శకురాలిగా 44 సినిమాలు చేయడం ప్రపంచ రికార్డుగా గుర్తించి గిన్నిస్ బుక్ లో చోటు కల్పించారు. అలా ఆమె ప్రతిభ గిన్నిస్ రికార్డ్స్ లో పదిలంగా ఉంది. ఇక ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి 2008లో రఘుపతి వెంకయ్య నాయిడు అవార్డు ఇచ్చింది. 

తెలుగు సినిమా పరిశ్రమలో.. ఇంకా చెప్పాలంటే, భారత చలన చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేసిన విజయనిర్మల 26 జూన్ 2019న, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో తన  73 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు. 

Watch this Interesting Video :

#tollywood #vijaya-nirmala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe