India Vs New Zealand:
టెస్ట్‌ల్లో భారత్‌ను సొంతగడ్డ మీద ఓడించడం ఎవరి తరమూ కాదు..ఆగండాగండి...ఇది మొన్నటి వరకూ ఇప్పుడు కాదు. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో టీమ్ ఇండియాను చిత్తుగా ఓడించి కీవీస్ జట్టు షాక్ ఇచ్చింది. భారత్‌ను...ఇండియాలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. భారత ఆధిపత్యానికి అడ్డకట్ట వేసింది. పూణె వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో కీవీస్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ ఒక్కడే 77 పరుగులతో రాణించాడు. మిగతావారు అతి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన మిచెల్ శాంట్నర్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
రెండో ఇన్నింగ్స్‌లో 198/5 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్‌ఇండియా 34 పరుగుల వద్ద రోహిత్ శర్ మొదటి వికెట్ కోల్పోయింది. తరువాత వరుసగా రెండో సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి అక్కడే ఖాయమైపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ , సర్ఫరాజ్ ఖాన్ లను ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో జడేజా 42 పరుగులు చేసి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
ఈ సీరీస్ ఓటమితో స్వదేశంలో టీమ్ ఇండియా ప్రతిష్ట పోయింది. 12 ఏళ్ళ తర్వాత సీరీస్‌ను కోల్పోయింది. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సీరీస్‌ల ఓడిన భారత్ ఇప్పుడు మళ్ళీ చేతిలో ఖంగుతింది. ఇక 1955లో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగగా.. ఇరు దేశాల 69 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరు జట్లు ఇప్పటివరకు తమ మధ్య 64 టెస్టులు ఆడగా.. అందులో భారత్ 22 గెలిచింది. న్యూజిలాండ్ 15 టెస్టుల్లో విజయం సాధించింది. 28 డ్రాగా ముగిశాయి.
Also Read: Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు!