DK Aruna: రూ. 15 కోట్లిస్తేనే పోటీ అన్నారు.. డీకే అరుణపై వంశీచంద్‌ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డీకే అరుణ ఎంపీగా పోటీ చేసేందుకు రూ. 15కోట్లు డిమాండ్ చేశారంటూ సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

DK Aruna: రూ. 15 కోట్లిస్తేనే పోటీ అన్నారు.. డీకే అరుణపై వంశీచంద్‌ సంచలన ఆరోపణలు
New Update

DK Aruna: కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డీకే అరుణ ఎంపీగా పోటీ చేసేందుకు రూ. 15కోట్లు డిమాండ్ చేశారంటూ సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాముడు, ప్రధానమంత్రి ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్న ఆమె డబ్బు రాజకీయాల గురించి ప్రజలకు తెలియాలనే ఇప్పుడీ విషయాన్ని బహిర్గతం చేస్తున్నానన్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మహబూబ్ నగర్‌లో శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన ఆరోపణలు నిజం కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాలు విసిరారు.

ఇది కూడా చదవండి: తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నేవి…దేశంలోనే రెండో స్టేషన్ ఏర్పాటు

బీజేపీ రాముడిని, మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటోందంటూ విమర్శించారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాలవుతుందన్నారు. కొందరు అవకాశవాదులు పార్టీ మారినప్పటికీ, నిజాయితీపరులైన కార్యకర్తలు పార్టీలోనే ఉండడం కాంగ్రెస్‌కు బలమన్నారు. వారి వల్లే ఎంపీ అభ్యర్థిగా తనకు చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు పడ్డాయన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి సహా అందరూ గెలుపొందారన్న వంశి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి బాహుబలి అని వ్యాఖ్యానించారు.

30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న భ్రమలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారని; అయితే, ఆ పార్టీ నుంచే 30 మంది ఎమ్మెల్యేలు తమ జేబులో ఉన్నారని అన్నారు మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నారు. వారి అక్రమాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయని, ప్రాజెక్టుల్లో అక్రమాలను ప్రజలు స్వయంగా గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి,పర్ణిక రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పార్టీ నేతలు కొత్వాల్, వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వసంత పాల్గొన్నారు.

#dk-aruna #yennam-srinivas-reddy #vamshichand-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe