ఖమ్మం జిల్లా: వైరా రిజర్వాయర్‌కు వెళ్లి రహదారి విస్తరణ పనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీలోని పాలకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు సంబంధించిన షాపులు తొలగించకుండా.. అక్రమంగా ఒక వైపే తొలగించారని గత రెండు, మూడు రోజుల నుంచి అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అఖిలపక్షం నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే ఫైర్: అయితే.. రోడ్డు విస్తరణ పనులలో అందరికీ ఉపయోగపడేలా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేయకుండా ఉండాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ నేపథ్యంలోఎమ్మెల్యే రాములు నాయక్‌తో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయభాయ్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. 66 అడుగులకు ఆమోదం తెలిపిన తరువాత ఇంకా అఖిలపక్షం కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఏముందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని అలాగే వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాములు నాయక్ విజయభాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గందరగోళం ఏర్పడి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాములు నాయక్ అఖిలపక్షం సమావేశం నుంచి అభ్యంతరంగా వెళ్లిపోవడంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోకుంది. స్థానిక పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేశారు.
అభివృద్ధి వైపు: వైరా రోజురోజుకు అభివృద్ధి సాధిస్తున్నా... పర్యాటక కేంద్రమైన రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన రహదారి మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇటీవల సుడా నిధులు రూ.కోటి మంజూరు కావడంతో రహదారి వెడల్పునకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ నిధులతో వైరా రింగ్ రోడ్డు సెంటర్ నుంచి రిజర్వాయర్ కాల్వ వరకు రోడ్డు వెడ ల్పు చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మా ణం చేపట్టనున్నారు. ఈమేరకు ఇరువైపులా చేపల అమ్మకందారులు, చిరు వ్యాపారులు నిర్మించుకున్న షెడ్లను మున్సిపల్ అధికారులు తొలిగించారు. దీంతో వివాదం మరింత పెరిగిన విషయం తెలిసిందే. రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన రహదారి 100 అడుగుల మేర ఉండగా.. వ్యాపారస్తులు రోడ్డును సైతం అక్రమించుకున్నారు. ఏది ఏమైనా రికార్డుల ప్రకారం 66 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సిందేనని స్థానికులు కోరుతున్నారు.