/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/UTS-App-jpg.webp)
UTS App: మన రైల్వేశాఖ చేసే పనులు ఒకోసారి చికాకు తెప్పిస్తాయి. హై టెక్నాలజీ అంటారు.. తీరా దానిని ఉపయోగించుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తే అది పనిచేయక ఇబ్బందుల్లో పడటం జరుగుతుంది. పైగా రైల్వేకి సామాన్యులు అంటే చిన్నచూపు అనే సంఘటనలు చాలా చూసాం. అలాంటిదే మరోటి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మీరు రిజర్వేషన్ చేయించుకోవాలంటే.. ఐఆర్టీసీ యాప్ (IRCTC) అందుబాటులో ఉంది. ఇది కాకుండా దాదాపుగా అన్ని యూపీఐ యాప్ లు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ (Train Tickets) కోసం అవకాశం కల్పించాయి. అలాగే చాలా ట్రావెల్ యాప్స్ కూడా ట్రైన్ రిజర్వేషన్ లో ఉపయోగపడతాయి. కాకపొతే, యూజర్ చార్జీలు వసూలు చేస్తాయి. అందువల్ల టికెట్ రిజర్వ్ చేసుకుని ప్రయాణించే వారికి ఏ సమస్యా లేదు. కానీ, సాధారణ ప్రయాణీకులకు మాత్రం తిప్పలు తప్పవు. స్టేషన్ లో టికెట్ కొనడానికి చాంతాడంత క్యూ ఉంటుంది. ఒక్కోసారి ఈ క్యూలో నిలబడితే టికెట్ తీసుకునే సరికి మన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇలా చాలామంది ప్రతిరోజూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. టెక్నాలజీని విపరీతంగా వాడుకునే రైల్వే.. ఇలా సాధారణ ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ఒక యాప్ తీసుకువచ్చింది. దాని పేరు యూటీఎస్(UTS App). ఇందులో జనరల్ టికెట్స్, మెట్రో టికెట్స్, ఎంఎంటీసీ ట్రైన్ టికెట్స్, లోకల్ రైళ్ల టికెట్స్ తీసుకునే అవకాశం ఉంది. అన్నట్టు ప్లాట్ ఫామ్ టికెట్స్ కూడా ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు. ఏమిటి ఇవన్నీ మాకు తెలుసు అంటారా? అయితే ఈ యాప్ లో ఉన్న సమస్య కూడా మీకు తెలిసి ఉండాలే? అవును ఈ యాప్ ఉపయోగించడంలో చాలా పెద్ద ఇబ్బంది ఉంది. టెక్నీకల్ గా ఉన్న ఈ ఇబ్బంది కారణంగా, సాధారణ ప్రయాణీకుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ముందుగా వెంకట్ అనే ఒక ప్రయాణీకుడు చేసిన ఈ X పోస్ట్ (ట్వీట్) చూడండి..
My long distance train arrived and there is a local train ready to depart from the adjacent platform. I couldn't board that because I had to go out to scan the QR code as this app didn't allow me to book the ticket.
This is what happens when the babus sitting in the AC rooms… pic.twitter.com/pme5UbVymT— Venkat 🐶 (@snakeyesV1) March 19, 2024
చూశారుగా.. ఇందులో వెంకట్ యూటీఎస్ యాప్ తో తానూ పడ్డ ఇబ్బంది వివరించారు. ఆయన ఏమన్నారంటే.. “దూరప్రాంతం నుంచి నేను స్టేషన్ లో దిగాను. ప్రక్కనే ఉన్న ప్లాట్‌ఫారమ్ నుండి బయలుదేరడానికి లోకల్ రైలు సిద్ధంగా ఉంది. అప్పుడు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఈ యాప్ నాకు సహకరించలేదు. దానివలన నేను, QR కోడ్‌ని స్కాన్ చేయడానికి బయటకు వెళ్లవలసి వచ్చింది. దీంతో నేను లోకల్ ట్రైన్ ఎక్కలేకపోయాను. ఏసీ రూముల్లో కూర్చునే బాబులకు ఇలాంటి యాప్స్ ఎలా పని చేస్తున్నాయో తెలియకపోవడంతో ఇలా జరుగుతుంది” అదీ విషయం. ఈ పోస్ట్ కిందే యాప్ టికెట్ కోసం ప్రయత్నించినపుడు ఏమి చెప్పిందో స్క్రీన్ షాట్ కూడా వెంకట్ పోస్ట్ చేశారు. అది కూడా చూశారుగా. అందులో “మీ డివైజ్ యాక్యురసీ 13 మీటర్లు. అందువల్ల మీరు స్టేషన్ నుంచి లేదా రైల్ ట్రాక్ నుంచి 13 మీటర్ల దూరం వెళ్లి ప్రయత్నించండి” అని ఉంది.
Also Read: ఇది మామూలు స్పీడ్ కాదు.. ఒక్క నిమిషంలో 90 సినిమాలు డౌన్‌లోడ్..
ఇది సాధ్యమా?
యూటీఎస్ అనే యాప్(UTS App) ను ప్రవేశపెట్టిందే స్టేషన్ లో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి. ఎవరైనా స్టేషన్ కు వచ్చిన తరువాత ఈ యాప్ ద్వారా టికెట్ తీసుకోవాలంటే సాధ్యం కాని పరిస్థితి. ప్రయాణానికి ముందుగా స్టేషన్ చేరుకోక ముందే టికెట్ తీసుకోవాలన్న మాట. అసలు కనీస జ్ణానం ఉన్నవారెవరికైనా ఇది శుద్ధ తప్పుడు విధానం అని తెలుస్తుంది. ఎందుకంటే, అందరూ స్టేషన్ బయట టికెట్ తీసుకుని రావడం సాధ్యపడదు. ఉదాహరణకు మీరు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చారు. స్టేషన్ లో దిగిన తరువాత మీరు ఫలక్ నుమా వెళ్ళాలి. పక్క ప్లాట్ ఫార్మ్ లో మీకు లోకల్ ట్రైన్ రెడీగా ఉంది. అప్పుడు మీరు టికెట్ కోసం కౌంటర్ కి వెళ్ళలేరు కదా. ఈ రైల్వే ఘనంగా చెప్పే యూటీఎస్ యాప్ పనిచేయదు. అప్పుడు ఏమి చేయాలి. టికెట్ కోసం కౌంటర్ దగ్గరకు వెళ్ళేలోపు మీ లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇదొక్కటే కాదు.. మీరు ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కి వెళ్లారు. ప్లాట్ ఫార్మ్ పైకి వెళ్ళాలి. ప్లాట్ ఫార్మ్ టికెట్ తీసుకుందాం అంటే ఈ యాప్(UTS App) పని చేయదు.. అప్పుడు మీరు కౌంటర్ దగ్గర నిలబడాలి.. లేదా అక్కడ గోడలకి అంటించి ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనాలి. ఒక్కోసారి ఈ క్యూర్ కోడ్ కూడా మన మాట వినదండోయ్. అది వేరే కథ. మళ్ళీ చెప్పుకుందాం.
ఈ విషయం రైల్వే శాఖకు తెలీదా? ఈ ప్రశ్న మీకు రావడంలో ఆశ్చర్యం లేదు. తెలిసే ఉంటుంది. కానీ.. అది ఐఆర్టీసీ యాప్ లా డబ్బులు తెచ్చిపెట్టే యాప్(UTS App) కాదు కదా. సాధారణ టికెట్స్ యాప్. ఇందులో పెద్దగా బిజినెస్ ఉండదు. ఎదో యాప్ ఉంది.. నడుస్తుంది. వాళ్ళే స్టేషన్ బయటకు వెళ్లి టికెట్ బుక్ చేసుకుని వస్తారు. అయినా.. ఊరు వెళ్ళాలి.. రైలెక్కాలి అనుకున్నోడు ఎలాగైనా టికెట్ తీసుకుంటాడు. కౌంటర్ రద్దీగా ఉన్నా.. యాప్(UTS App) పనిచేయకపోయినా.. ప్రయాణం ఆపుకోలేడు కదా.. మాకొచ్చిన నష్టం ఏమిటనే నిర్లక్ష్యమే ఈ యాప్ ని సరిచేయించలేకపోవడానికి కారణం అని సాధారణ ప్రయాణీకులు అనుకోవడంలో తప్పు లేదు కదా.
మీకు వెంకట్ ఒక్కరే కాదు ఇలా ఇబ్బంది పడింది అని అనిపిస్తే ఆయన ట్వీట్ కింద ఉన్న కామెంట్స్ కూడా చూడండి.. ఈ ట్వీట్ 24 గంటల్లో రెండున్నర లక్షల మంది చూశారు. నాలుగు వందలకు పైగా కామెంట్స్ వచ్చాయి. అన్నిటిలోనూ దాదాపు ఇదే కారణంతో తమ ప్రయాణం ఇబ్బందిలో పడింది అని చెప్పారు.
అదండీ విషయం. ఇప్పటికైనా రైల్వే శాఖ ఈ యూటీఎస్ యాప్(UTS App) లో ఉన్న ప్రధానమైన లోపాన్ని సరిచేసి.. తమకు సాధారణ ప్రయాణీకులపై ఎటువంటి వివక్షా లేదని నిరూపించుకోవాలి. లేదంటే, అందరూ అనుకున్నదే నిజం అని సాధారణ ప్రయాణీకులు భావిస్తే వారి తప్పులేదు.