Uppena wins National Award for Best Telugu Film in the Regional: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతాయి. ఒక్కసారిగా పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపుతాయి. కరోనా సమయంలో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు ఇళ్ల దగ్గరే ఉండి ఓటీటీ లో సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అటువంటి సమయంలో వచ్చిన చిత్రం ఉప్పెన. బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించింది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది.
తొలిచిత్రంతోనే సంచలనాలు
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెన. సనా బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇలా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా దెబ్బకు, బడా సినిమాల రికార్డులు కూడా చెల్లాచెదురయ్యాయి.
అంతటి సంచలనం సృష్టించిన ఉప్పెన సినిమాకు 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో సముచిత స్థానం దక్కింది. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
Also Read: National Film Awards: తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. RRRకు 6, పుష్పకు 2..