NEP not imposed on states : జాతీయ విద్యా విధానం(NEP)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఈపీ అనేది ఒక అనువైన విధానమని చెప్పారు. ఎన్ఈపీ అనేది కేంద్రం నిర్ణయించి అన్ని రాష్ట్రాలపై విధించేది కాదని తెలిపారు. ఎన్ఈపీ ప్రగతిశీల విధానమని చెప్పారు. అందరితో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే దీన్ని తీసుకు వచ్చామన్నారు.
భువనేశ్వర్ లో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.... ఎన్ఈపీ అనేది విస్తృతమైన ఫ్రేమ్ వర్క్ అని తెలిపారు. తమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఈపీ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టామన్నారు. ఏదైనా విషయాన్ని మాతృభాషలో నేర్చుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు ఆలోచనలో స్పష్టత వుంటుందన్నారు.
భవిష్యత్ లో అది చాలా ఉపయోగపడుతుందన్నారు. ఎన్ఈపీని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మెనిఫెస్టోల ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఎన్ఈపీని రద్దు చేయనున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
ఎన్ఈపీ ద్వారా తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తామని ఉదయ నిధి స్టాలిన్ అన్నారు. అంతకు ముందు దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యారంగాన్ని పార్టీలు తమ రాజకీయ ఎత్తుగడల కోసం పావుగా ఉపయోగించుకోకూడదని అన్నారు. విద్యా ప్రగతిలో ఎన్ఈపీ అనేది ఓ కాంతి పుంజంలా మారుతుందన్నారు.
Also Read: మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారిన వారే… గులాం నబీ ఆజాద్ సెన్సేషనల్ కామెంట్స్…!