Uddhav Thackeray: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలమూలాల నుంచి బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉందన్నారు. ప్రజలు స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో గోద్రా లాంటి అల్లర్లు జరగవొచ్చని ఠాక్రే పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జల్గావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ(BJP), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)లకు చెందిన ఆరాధించే వ్యక్తులు లేక సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజ నేతలను ఆరాధిస్తున్నారని విమర్శించారు.
దుమారం రేపుతున్న ఠాక్రే వ్యాఖ్యలు..
లోక్‌సభ ఎన్నికల సమయంలో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రామమందిరాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ట్రస్టు సభ్యులు ప్రకటించారు. ఈ తరుణంలో ఠాక్రే వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్(CONGRESS), ఎన్‌సీపీ(NCP)లతో శివసేన జట్టు కట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీకి శత్రు పార్టీగా మారిపోయింది. ఈ క్రమంలోనే శివసేన నుంచి షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో మహా వికాస్ అఘాడ్ కూటమి అధికారం కోల్పోయింది. బీజేపీ ఎమ్మెల్యేల మద్దుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా ఎంపిక అయ్యారు. తామే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హిందుత్వానికి నిజమైన అనుచరులమని బీజేపీ, షిండే కూటమి పేర్కొంది.
దేశంలో సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్లు..
2002వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వతేదీన గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా స్టేషన్‌లో అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కరసేవకుల రైలు కోచ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంతో మంది మరణించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ ఒక విష సర్పం: ఉదయనిధి స్టాలిన్!