YCP MP'S: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం నేతలు రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేయగా.. తాజాగా ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు అందజేశారు. ఈ క్రమంలో వారు ఇద్దరు వచ్చే నెల 5, 6 తేదీల్లో మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
జగన్ తో విభేదాల వల్లే..
మోపిదేవి మాట్లాడుతూ తన రాజీనామా పై వివరణ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసేందుకు చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. పార్టీకి రాజీనామా చేయడానికి జగన్ తో ఉన్న విభేదాలు కూడా ఒక కారణమే అని పేర్కొన్నారు. మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలను మీడియా ముందు పెట్టాలను తాను అనుకోవడం లేదని చెప్పారు. తనకు రాజ్యసభ పదవి ఇష్టం లేదని అన్నారు. తాను స్థానిక రాజకీయాల్లో ఉండాలని అనుకున్నానని చెప్పారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడే పార్టీకి రాజీనామా చేద్దాం అనుకున్నానని.. కానీ , ఆ సమయంలో చేస్తే పార్టీకి, జగన్ కు నష్టం చేకూరుతుందని రాజీనామా చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉందని.. తాను ఎన్నో పదవులు అనుభవించి వచ్చానని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని పేర్కొన్నారు. టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని.. ఎప్పుడు చేరుతానేది త్వరలోనే చెప్తానని అన్నారు.