ఏపీ(ap) కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు ఐరాస(uno)లో ప్రసంగించే అవకాశం రావడంతో ఆ విద్యార్థులపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎం. శివలింగమ్మ, సీ. రాజేశ్వరిలు ఐరాస సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో న్యూయార్క్ వేదికగా జరిగే ఐరాస సమావేశంలో విద్య గురించి ఆ విద్యార్థులు ఉపన్యసించనున్నారు.
కర్నూలు జిల్లా పొదల కుంట మాదిరి గ్రామానికి చెందిన ఎం. శివ లింగమ్మ(shiva lingamma), నంద్యాల పట్టణానికి చెందిన సి. రాజేశ్వరి(Rajeshwari) నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు. లింగమ్మ తల్లి దండ్రులు సోమనాథ్, గంగమ్మలు రోజు వారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆధోనిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో లింగమ్మ పదవ తరగతి పూర్తి చేశారు. పదో తరగతిలో ఆమెకు 541 మార్కులు వచ్చాయి.
ఇక రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్, తల్లి రామ లక్ష్మి కూలి పని చేస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్లది. ఏపీ గవర్నమెంట్ మోడల్ స్కూల్ నంద్యాలలో రాజేశ్వరి పదో తరగతి పూర్తి చేశారు. పదో తరగతిలో ఆమె 583 మార్కులు సాధించింది. ఆమెకు జగనన్న ఆణిముత్యాలు అవార్డు కూడా అందజేశారు. ఇప్పుడు అదే స్కూల్ లో ఆమె ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఇటీవల ఐరాస నిర్వహించిన పరీక్షకు వాళ్లిద్దరూ హాజరయ్యారు. పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఐరాస సభలో పాల్గొనే అవకాశం వారికి వచ్చింది. దీంతో పాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను సందర్శించే అవకాశం వారికి లభించింది. ఈ అవకాశం రావడం తమకు చాలా ఆనందంగా వుందని విద్యార్థినులు తెలిపారు.